పోగు బంధం.. నూలు పౌర్ణమి..
సిరిసిల్ల తో పెనవేసుకున్న పోగుబంధం..
ఆత్మీయ బంధాలను పెంచే రాఖీ పౌర్ణమి గా ఎక్కువమందికి తెలిసిన పద్మశాలి సామాజిక వర్గం నూలు పౌర్ణమి వేడుకను పవిత్రంగా జరుపుకుంటారు. నూలు పౌర్ణమితో సిరిసిల్ల పద్మశాలీలకు పెనవేసుకున్న ఆత్మీయ పోగు బంధాలను తడిమి చూస్తే అనేక విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
సిరిసిల్ల గ్రామంగా ఉన్న నాటి నుంచి ప్రస్తుతం జిల్లా కేంద్రంగా మారేదాకా అనేక పరిణామాలు చోటు చేసుకున్న పద్మశాలీలకు నూలు పున్నం (పౌర్ణమి)తో పెనవేసుకున్న బంధం మాత్రం సజీవంగా నిలబడుతూ వస్తోంది. నూలు పౌర్ణమి వేడుకల సందర్భంగా జరిగే పద్మశాలీలు చేతిమగ్గం రథయాత్ర, శోభాయాత్ర అందుబాటులో ఉన్న సమాచారం తో సంక్షిప్తంగా..
పద్మశాలి సామాజిక వర్గానికి నూలు పౌర్ణమితో పెనవేసుకున్న పోగు బంధానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. తరతరాలుగా పద్మశాలీల వృత్తి కళ నైపుణ్యం పరిణామం చెందుతున్న అంతర్లీనంగా తరతరాలను పెనవేసుకుంటూ వస్తు నిరంతరాయంగా కొనసాగుతునే వస్తుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూలు పౌర్ణమి ప్రత్యేకతను సంతరించుకుంది.చేతి మగ్గం శోభాయాత్ర గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడెక్కడ చేతి 'మగ్గం శోభాయాత్ర' సాంప్రదాయం ఎప్పటినుంచి ఎక్కడెక్కడ కొనసాగుతుందన్న సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేకతను చాటుతున్న నూలుపౌర్ణమి సందర్భంగా జరిగే చేతి మగ్గం శోభయాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక ప్రాంతాల్లో కొనసాగుతూ వస్తుంది. కోనరావుపేట్ మండలం నిమ్మపల్లి గ్రామంతో పాటు తంగళ్ళపల్లి మండల కేంద్రం, రుద్రంగి మండల కేంద్రాలలో చేనేత వృత్తిని పవిత్రంగా భావించే పద్మశాలీల ఆధ్వర్యంలో చేతి మగ్గంతో శోభాయాత్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల నేతన్నలతో పెన వేసుకున్న పోగు బంధాన్ని నూలు పౌర్ణమి యాది చేస్తోంది.
సిరిసిల్ల ప్రత్యేకం..
చేతి మగ్గంతో జరిగే శోభాయాత్ర విషయంలో సిరిసిల్ల పట్టణానికి ప్రత్యేకత ఉన్నది. పద్మశాలీల ఇష్ట దైవమైన మార్కండేయ గుడి దగ్గర ప్రారంభమైన శోభ యాత్ర పట్టణంలోని పురవీధులలో తిరిగి చేతిమగ్గంపై నేసిన వస్త్రాన్ని మార్కండేయుడికి సమర్పించే విధానం సుదీర్ఘ కాలంగా తరతరాలుగా కొనసాగుతూ వస్తుంది. ఒకనాడు సిరిసిల్ల చేనేత గ్రామంగా ఉన్న కాలం నుండి శోభాయాత్ర కొనసాగుతూ వస్తోంది. దొరుకుతున్న సమాచారం ప్రకారం 1970 సంవత్సర కాలం నుండి చేతి మగ్గం శోభాయాత్ర సిరిసిల్లలో కొనసాగుతూ వస్తున్నట్లు తెలుస్తోంది.
అప్పట్లో చేనేత గ్రామంగా ఉన్న కాలంలో సిరిసిల్లలో ఎద్దుల బండిపై చేతి మగ్గాన్ని ఏర్పాటు చేసి సిరిసిల్ల పురవీధులలో శోభాయాత్ర నిర్వహించే వారిని తెలుస్తుంది. సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శోభాయాత్ర జరుగుతూ వస్తోంది. 1970లో చేనేత వృత్తిదారుడైన నెహ్రూనగర్ కు చెందిన చేనేత వృత్తిదారుని నుంచి మొదలై, తరాలు మారుతున్న ఆ కుటుంబానికి చెందిన వారే చేతిమగ్గంపై వస్త్రాన్ని నేస్తూ వస్తున్నారు. చేతి మగ్గం నుంచి ఎడ్ల బండ్లను దాటుకుంటూ నిర్వహిస్తున్న శోభాయాత్ర కాలంతో పాటు ఎన్నో మార్పులకు, పరిణామాలకు సాక్ష్యంగా నిలబడ్డది. సిరిసిల్లలోని ఒకనాడు దొడ్లమీది ప్రాంతంగా సుపరిచితమయిన ప్రస్తుతం శాంతినగర్ గా పిలవబడుతున్న సిరిసిల్లలో భాగమై సాగుతున్న శాంతినగర్ నుంచి కూడా ఆదర్శ పద్మశాలి సంఘం' ఆధ్వర్యంలో శోభయాత్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎంతోమంది చే'నేత కార్మికుల కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తున్న నూలు పౌర్ణమి తో పెను వేసుకున్న సిరిసిల్ల పద్మశాలీల పోగు బంధాన్ని నూలు పౌర్ణమి యాది చేస్తోంది.
అల్లె రమేష్, సీనియర్ పాత్రికేయులు, సిరిసిల్ల.