ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన గాజాలోని పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం చేసేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి.
ఇప్పటికే ఐక్యరాజ్యసమితి పంపిన సాయం ఈజిప్టు సరిహద్దు రఫా నుంచి గాజాకు చేరుకుంది.
ఈ నేపథ్యంలో ఇవాళ భారత్.. గాయపడిన పాలస్తీనీయులకు బాసటగా నిలిచింది.
గాజాలో గాయపడినవారికి అత్యవసరమైన మందులు, శస్త్రచికిత్స పరికరాలు, గుడారాలు, నీటిని శుద్దిచేసే మాత్రలు పంపినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
వైమానిక దళానికి చెందిన సీ 17 విమానంలో ఆరున్నర టన్నుల సామగ్రి ఈజిప్టులోని ఈఎల్ అరిష్ విమానాశ్రయానికి తరలనుంది.
అక్కడ నుంచి రఫా సరిహద్దు గుండా గాజాకు పంపించి..బాధితులకు అందించనున్నారు.
పాలస్తీనా పౌరులకు భారత్ మానవతాసాయం అందిస్తూనే ఉంటుందని విదేశాంగ శాఖ ప్రకటించింది.