ఈ నెల 28న చంద్ర గ్రహణం.. యాదాద్రి ఆలయం మూసివేత

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈ నెల 28న మూసివేయనున్నారు. చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసి వేయనున్నారు. ఈ నెల 28న సాయంత్రం నాలుగు గంటల నుంచి 29వ తేదీ ఉదయం ఐదు గంటలకు వరకు ఆలయాన్ని మూసివేస్తారు. చంద్ర గ్రహణానికి ముందు రోజు 27వ తేదీన రాత్రి 7 గంటలకు శరత్‌ పౌర్ణమి వేడుకలను బ్రహ్మోత్సవ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. చంద్ర గ్రహణం సందర్భంగా 28వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఆలయాన్ని మూసివేసి, తిరిగి 29వ తేదీ వేకుజామున ఐదు గంటలకు తెరిచి సంప్రోక్షణ చేస్తామని ఆలయ ప్రధాన అర్చకులు నందింగల్ లక్ష్మీనరసింహచార్యులు చెప్పారు.

గ్రహణం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాలైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను కూడ మూసివేయనున్నారు. అశ్విని మాసం పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం సంభవిస్తుందని, ఈ నెల 28వ తేదీన అర్ధరాత్రి 1.06 గంటలకు ప్రారంభమై.. 2.22 గంటల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. గంట 16 నిమిషాల పాటు గ్రహణ సమయం ఉంటుందని, దీన్ని అంశిక చంద్ర గ్రహణంగా పిలుస్తారని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post