రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
అవసరమైన చోట సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి
రహవీర్ ద్వారా ఆర్థిక సహాయానికి ఒకరి ఎంపిక
డీఆర్ఎస్ సీ సమావేశంలో చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
వివిధ శాఖల అధికారులతో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం
రాజన్న సిరిసిల్ల, 17 సెప్టెంబర్ 2026: రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీఆర్ఎస్ సీ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో గురువారం నిర్వహించారు.
జిల్లాలో గత నెలలో జరిగిన ప్రమాదాలు, మరణాలపై సమీక్ష చేశారు. జిల్లాలో నెల రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 1072, ఎం వీ ఐ యాక్ట్ కింద 20,449 కేసులు నమోదు చేశామని, రోడ్డు ప్రమాదాలు 30 జరిగాయని, ఏడుగురు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
రహవీర్ కింద సహాయానికి ఒకరి ఎంపిక
రోడ్డు ప్రమాదంలో క్షతగత్రులను ఆసుపత్రికి తరలించిన సిరిసిల్ల పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ పోసు శ్రీనివాస్ రూ. 25 వేల ఆర్థిక సహాయానికి ఎంపిక అయినట్లు అధికారులు తెలిపారు. సిరిసిల్ల పాత బస్ స్టాండ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో మహిళ, మరో ప్రమాదంలో ఒకరు గాయపడగా, వారిని శ్రీనివాస్ వెంటనే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. దీంతో శ్రీనివాస్ పేరును ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు తెలిపారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నుంచి వాహనదారులను కాపాడడమే ప్రదాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించే వాహనదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్కూల్ బస్సులు, ఆటోల్లో విద్యార్థులను నిబంధనల ప్రకారం తరలించాలని సూచించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించాలని, రోడ్డు భద్రత, నియమాలు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా సూచించాలని జిల్లా కలెక్టర ఆదేశించారు. అవసరమైన చోట సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే చోట ఆర్ అండ్ బీ, రవాణా శాఖ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలించాలని ఆదేశించారు. ఆయా రోడ్ల మరమ్మత్తు పనులు చేయించాలని సూచించారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత చర్యలు కచ్చితంగా పాటించేలా అవగాహన కార్యక్రమాలు, చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రోడ్ల పైకి వచ్చే చెట్ల కొమ్మలను క్రమం తప్పకుండా తొలగించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సమావేశంలో ఈఈ ఆర్ అండ్ బీ భీమ్లా నాయక్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, రోడ్డు భద్రత కమిటీ సభ్యుడు సంగీతం శ్రీనాథ్(వింకు), ఎస్బీ డీఎస్బీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, జాతీయ రహదారి అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.