అధినేత ఆశీస్సులు ఎవరికో.. సిరిసిల్ల మున్సిపల్ పీఠం పై చక్రం తిప్పేదెవరు..

అధినేత ఆశిస్సులు ఎవరికో..!

సిరిసిల్ల మున్సిపల్" పీఠం"పై చక్రం తిప్పేదెవరు..!


వైస్ చైర్మన్ ఎవరికి దక్కేనో..

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఎక్కడ చూసినా ఇదే చర్చ

రాజన్న సిరిసిల్ల జిల్ల ప్రతినిధి: ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా భారత రాష్ట్ర సమితి సిరిసిల్లాలో దూసుకుపోయింది. సిరిసిల్లలో 27 స్థానాల్లో విజయం సాధించి ఘనవిజయాన్ని బిఆర్ఎస్ ఖాతాలో వేసుకుంది.

ఇంత ప్రచారం జరిగినా, సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు వెన్నంటే ఉంటూ వస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో అత్యధిక స్థానాల్లో భారత రాష్ట్ర సమితికి ప్రజలు విజయం అందించారు.

కారు పరిగెత్తింది సరే.. మున్సిపల్ చైర్మన్ గిరి పై ఎవరు చక్రం తిప్పుతారనే అంశం ప్రస్తుతం సిరిసిల్ల పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కేవలం 22 స్థానాలకే పరిమితం కాగా ప్రతిపక్షంలో ఉంటూ కూడా 27 స్థానాల్లో విజయం సాధించిన విషయం ప్రత్యేకమనే చెప్పాలి. ప్రతిష్టాత్మకమైన సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని భారత రాష్ట్ర సమితి ఎవరికి అప్పగిస్తుందనే అంశం పై తీవ్రంగా చర్చ జరుగుతుంది.

భారత రాష్ట్ర సమితి నుండి రెండోసారి విజయం సాధించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ కు మరోసారి అవకాశం వస్తుందా.. భారత రాష్ట్ర సమితిలోని సీనియర్ నాయకులుగా ఉన్న గుండ్లపల్లి పూర్ణచందర్ సతీమణి నీరజ లేదా దార్నం అరుణ లలో ఎవరు అవకాశాన్ని అందిపుచ్చుకుని చైర్ పర్సన్ పీఠాన్ని అధిరోహిస్తారో..! మరో సీనియర్ నాయకులు మంచే శ్రీనివాస్ సతీమణి రేణుక ను చైర్మన్ పీఠం వరుస్తుందా అన్న చర్చ సీరియస్ గానే నడుస్తున్నట్లు తెలుస్తోంది.

సిరిసిల్ల మున్సిపాలిటీలో ప్రధానమైన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఈ నేతలు ఆశావాహుల జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

వైస్ చైర్మన్ పీఠంపై..

భారత రాష్ట్ర సమితిలో అన్ని సర్దుబాటులను సరి చేసేందుకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. చైర్ పర్సన్ పీఠం పద్మశాలి సామాజిక వర్గానికి కేటాయిస్తే మున్నూరు కాపు సామాజిక వర్గానికి వైస్ చైర్మన్ పీఠం కేటాయించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

సిరిసిల్ల మున్సిపల్ లో వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న కల్లూరి రేణుక కు ఈసారి వైస్ చైర్మన్ పీఠం దక్కనున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీ తో పాటు సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో అన్నది సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో చర్చ నడుస్తోంది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు భారీ విజయాలు అందించిన సిరిసిల్ల ప్రజలకు సేవలను అందించేందుకు కేటీఆర్ ఎవరికి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ అప్ప చెబుతారన్నది వేచి చూడవలసి ఉన్నది.

Post a Comment

Previous Post Next Post