పని వద్దు చదువే ముద్దు
హెల్పింగ్ హార్ట్స్ బాల కార్మిక నిరోధక క్యాంపులో సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్ పిలుపు
రాజన్నసిరిసిల్ల, 12 జూన్: ప్రపంచ బాల కార్మిక నిరోధక దినోత్సవం సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థ, అధ్యక్షుడు ఆలువాల ఈశ్వర్ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల కార్మికుల నిర్మూలన, బాలల హక్కుల పట్ల అవగాహన ప్రజల్లో కల్పించేందుకు సంతకాల సేకరణ (సిగ్నేచర్ క్యాంపు) ను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ కమటం అంజయ్య హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూల కోసం ప్రపంచ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ) ప్రతి సంవత్సరం ఒక స్పష్టమైన థీమ్ తో ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా స్వచ్ఛంద సంస్థలను, ప్రభుత్వ శాఖలను కోరుతుందని అన్నారు.
అందులో భాగంగానే ఈ సంవత్సరం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రపంచ వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు లెట్స్ ఆక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్స్ అగైనెస్ట్ చైల్డ్ లేబర్ అనే నినాదంతో ముందుకు వెళుతున్నట్లు వివరించారు.
సమాజంలో విస్తృత అవగాహనకు, బాల కార్మిక నిర్మూలన కోసం ప్రజల్లో సంకల్పం పెంచడంతో పాటు స్వచ్ఛందంగా తాము బాధ్యతను తీసుకునేందుకు ఇలాంటి సిగ్నేచర్ క్యాంపులు దోహద పడతాయని అన్నారు.
జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ శాఖ ద్వారా చైల్డ్ లేబర్ నివారణ కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు.
బడి మాని పనిలో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి బడిలో చేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బాల కార్మిక నిర్మూలనకు అన్ని శాఖలు, స్వచ్ఛంద సంస్థలతో కలసి పని చేస్తున్నట్లు వివరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాలల హక్కుల పట్ల నిరంతరం చైతన్యాన్ని హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ కల్పిస్తుండడం అభినందనీయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి చైర్మన్ కమటం అంజయ్య, హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు ఆలువాల ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల తిరుమల, సైకాలజిస్ట్ పున్నంచందర్, హెడ్మాస్టర్ మోతీలాల్, చింతోజు భాస్కర్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, అడ్వకేట్ అడేపు వేణు, రోజా, ఓడ్నాల శ్రీనివాస్, వేముల మార్కెండేయులు, గుండెల్లి శ్రీనివాస్, ఆంకారపు జ్ఞానోభ, పాకాల శంకర్ గౌడ్, లక్ష్మీనారాయణ, వెంకట్, లక్ష్మణ్, పరమేశ్వర్, విజయలక్ష్మి, సుష్మా, నిషాద్ పాల్గొన్నారు.