RTO అధికారిగా పరిచయం చేసుకుని సైబర్ మోసానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్.. రిమాండ్ కి తరలింపు
వివరాలు వెల్లడించిన వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్
వేములవాడ, 8 అక్టోబర్ 2026: వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హన్మాజిపేట గ్రామానికి చెందిన వ్యక్తి ని బురిడీ కొట్టించి RTO అధికారిగా ఫోన్ లో తప్పుడు పరిచయం చేసుకుని, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ పేరుతో అట్టి వ్యక్తిని మోసం చేసి డబ్బులు కాజేసిన వ్యక్తిని వేములవాడ రూరల్ పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత జూన్ నెల 1న హన్మాజిపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కి మొబైల్ ఫోన్ ద్వారా ఒక వ్యక్తి కాల్ చేసి, తాను సిరిసిల్ల RTO ఆఫీస్ నుండి నరేష్ ని మాట్లాడుతున్న అని పరిచయం చేసుకున్నాడు. అనంతరం డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయకపోతే లైసెన్స్ బ్లాక్ అవుతుందని భయపెట్టి, RTO Sir తో మాట్లాడిస్తానని చెప్పి, తన గొంతును మార్చి RTO అధికారిగా నటించాడు. లైసెన్స్ రెన్యువల్ కోసం వెంటనే డబ్బులు చెల్లించాలని నమ్మించి, బాధితుడి నుంచి PhonePe ద్వారా మూడు విడతల్లో మొత్తం రూ.4,200 బదిలీ చేయించుకున్నాడు.
బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా బాధితుడి బ్యాంకు లావాదేవీలు, మొబైల్ నంబర్లు, వాయిస్ రికార్డింగ్ తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి, నిందితుడిని గుర్తించారు.
ఈరోజు వేములవాడ అర్బన్ కాలనీలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, నేరానికి సంబంధించిన విషయాలను వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్, అందులోని రెండు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు గతంలో RTO కన్సల్టెన్సీ షాపులో పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించుకుని, డ్రైవింగ్ లైసెన్స్/వాహన రిజిస్ట్రేషన్ పనుల కోసం తనకు పరిచయమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, RTO అధికారిగా తప్పుడు పరిచయం చేసుకుని డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. ఇదే విధంగా మరికొంతమంది వ్యక్తుల వద్ద నుండి కూడా డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు.
ప్రజలు ఎవరైనా RTO, పోలీస్, బ్యాంక్ లేదా ఇతర ప్రభుత్వ అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మి డబ్బులు బదిలీ చేయవద్దని, సంబంధిత కార్యాలయాలను నేరుగా సంప్రదించి వివరాలను నిర్ధారించుకోవాలని వేములవాడ రూరల్ పోలీసులు సూచించారు. అనుమానాస్పద సైబర్ మోసాలు జరిగిన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
Tags
Crime news