జ్యోతిష్యం కోసం పేరు మార్చుకోవచ్చా?
కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు
బెంగళూరు, 8 అక్టోబర్ 2026: జ్యోతిష్యం, న్యూమరాలజీ నమ్మకాల ఆధారంగా పేరు మార్చుకోవాలనుకునే వారికి కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తిని సమాజంలో అతని లేదా ఆమె పేరుతోనే గుర్తిస్తారని, తన పేరుతో గుర్తింపు పొందడం ప్రతి భారత పౌరుడికి ఉన్న పౌర హక్కు అని కోర్టు స్పష్టం చేసింది.
కర్ణాటకకు చెందిన ఓ మైనర్ బాలిక పేరు మార్చేందుకు ఆమె తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ హంచటే సంజీవ్‌కుమార్ విచారణ జరిపారు. పుట్టినప్పుడు ఆ బాలికకు ‘లక్ష్మి ఎన్.’ అని పేరు పెట్టారు. అయితే జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ఆధారంగా ఆ పేరును ‘వీణ ఎన్.’ గా మార్చాలని తల్లిదండ్రులు నిర్ణయించారు.
ఈ పేరు మార్పు కోసం తల్లిదండ్రులు సివిల్ కోర్టును ఆశ్రయించగా.. తొలుత ఆ కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ‘వీణ’ పేరుతో బాలిక ఇప్పటికే గుర్తింపు పొందుతున్నట్లు చూపించే పత్రాలు సమర్పించలేదని, అలాగే పాఠశాలలో పేరు మార్చేందుకు ముందుగా ప్రయత్నించలేదని ట్రయల్ కోర్టు పేర్కొంది.
ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయగా.. హైకోర్టు ట్రయల్ కోర్టు వైఖరిని తప్పుబట్టింది. ఇది పేరు సరిదిద్దే అంశం కాదని, ఉన్న పేరును పూర్తిగా మార్చుకోవాలనుకున్న కేసు అని స్పష్టం చేసింది. అందువల్ల కొత్త పేరు ఇప్పటికే ఉపయోగిస్తున్నట్లు నిరూపించే పత్రాలను అడగడం సముచితం కాదని పేర్కొంది.
అంతేకాకుండా, పేరు మార్పుపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని, కొత్త పేరు వల్ల ఇతరులకు ఎలాంటి నష్టం లేదా ఇబ్బంది కలగదని కోర్టు గమనించింది. దీంతో ‘లక్ష్మి ఎన్.’ పేరును ‘వీణ ఎన్.’గా మార్చేందుకు అనుమతిస్తూ ట్రయల్ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. సంబంధిత రికార్డుల్లో కొత్త పేరును గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
హై కోర్టు కీలక వ్యాఖ్య
“ప్రతి వ్యక్తిని సమాజంలో అతని/ఆమె పేరుతోనే గుర్తిస్తారు. పేరుతో గుర్తింపు పొందడం ప్రతి భారత పౌరుడి పౌర హక్కు. కాబట్టి పేరు సరిదిద్దడం లేదా మార్చడం కోసం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు” అని హైకోర్టు పేర్కొంది.
అయితే, పేరు మార్పు మరియు పత్రాల్లో తప్పుగా నమోదైన పేరును సరిదిద్దడం రెండూ వేర్వేరు అంశాలు అని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. కర్ణాటకలో అధికారిక రికార్డుల్లో పేరు మార్పు కోసం సంబంధిత సివిల్ కోర్టు డిక్రీ అవసరమని ప్రభుత్వం గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను కూడా కేసులో ప్రస్తావించారు.
జ్యోతిష్యం లేదా న్యూమరాలజీ కారణంగా పేరు మార్చుకోవాలనుకునే వారికి ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.