గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి: సిరిసిల్ల పట్టణ సిఐ శ్రీనివాస్
గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసు, విద్యుత్ శాఖల సూచనలు పాటించాలి
రాజన్నసిరిసిల్ల జిల్ల, 13 సెప్టెంబర్ 2026 : సిరిసిల్ల పట్టణంలోని గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్‌లో సిరిసిల్ల పట్టణ పోలీసులు గణేష్ మండపాల నిర్వాహకులు , గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
.గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఉత్సవాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమ నిబంధనలపై నిర్వాహకులకు పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అవగాహన కల్పించారు.
గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన సమయంలో ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పూజా కార్యక్రమాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, సౌండ్ సిస్టమ్ వినియోగంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత సమయం తర్వాత శబ్ద కాలుష్యానికి కారణమయ్యే విధంగా సౌండ్ సిస్టమ్ వినియోగించరాదని తెలిపారు.
అదేవిధంగా గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని, నిమజ్జన సమయంలో పోలీసు శాఖ సూచనలు, భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
ఈసమావేశంలో ఎస్‌ఐ గణేష్‌తో పాటు విద్యుత్ శాఖ ఏ.డి. అధికారులు హాజరయ్యారు.
