గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి – నిమజ్జనం సురక్షితంగా పూర్తి చేయాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదు
సిరిసిల్ల పట్టణంలో పలు గణేష్ మండపాలను దర్శించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రోజున సిరిసిల్ల పట్టణంలోని పలు గణేష్ మండపాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సందర్శించి, గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మండపాల వద్ద ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి, గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా, నిమజ్జనం సురక్షితంగా పూర్తయ్యేలా మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,200 గణేష్ మండపాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచించిన నిబంధనలు, భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు.
గణేష్ నిమజ్జనం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే సంబంధిత డీజే యజమానులతో పాటు మండపాల నిర్వాహకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మండపాల నిర్వాహకులు ముందస్తు ప్రణాళికతో నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు చోటుచేసుకోకుండా శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
ఉత్సవాల సందర్భంగా ఏవైనా సమస్యలు తలెత్తినా, అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ సూచించారు.
ఎస్పీ వెంట పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది మండపాల నిర్వాహకులు ఉన్నారు.