ఎయిర్ ఇండియా ఘటనపై మేరీ ఫాక్లర్ స్పందన.. అనుమానాలకు బ్రేక్ పడిందా..
అహ్మదాబాద్‌లో జూన్ 12, 2025న జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ దుర్ఘటన గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో సాంకేతిక సమస్యల కారణంగానే జరిగిందని అమెరికా రవాణా శాఖ మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ మేరీ ఫాక్లర్ స్కియావో అన్నారు. ఈ దుర్ఘటనకు పైలట్లను నిందించడం సరికాదని, విమానంలో సాఫ్ట్‌వేర్ సమస్యలే ఈ ప్రమాదానికి కారణమని ఆమె తెలిపారు.
డ్రీమ్‌లైనర్ సాంకేతిక సమస్య
మేరీ స్కియావో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2019లో జరిగిన ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్ విమాన ఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ బోయింగ్ 787 విమానం ఘటనలో ఎలాంటి పైలట్ల జోక్యం లేకుండానే, గాలిలో ఉండగా ఇంజన్‌లకు ఇంధన సరఫరాను సాఫ్ట్ వేర్ స్వయంగా నిలిపివేసిందన్నారు. 2019లో ANA విమానం ల్యాండింగ్ సమయంలో ఇలాంటి సమస్య వచ్చినట్లు చెప్పారు. ఆ క్రమంలో పైలట్లు ఇంధన సరఫరాను నిలిపివేయలేదని, డ్రీమ్‌లైనర్ విమాన సాఫ్ట్‌వేర్ స్వయంగా అలా చేసిందని స్కియావో వెల్లడించారు.
గాలిలో ఉండగా..
మరోవైపు అహ్మదాబాద్ దుర్ఘటనలో కూడా ఇదే జరిగినట్లు చెప్పారు. విమానం గాలిలో ఉండగా, అది భూమిపై ఉన్నట్లు సాఫ్ట్‌వేర్ భావించింది. దీని కారణంగా థ్రస్ట్ కంట్రోల్ మాల్ ఫంక్షన్ అకామొడేషన్ సిస్టమ్ ఇంజన్‌లకు ఇంధన సరఫరాను నిలిపివేసింది. పైలట్లు ఇంధన సరఫరా స్విచ్‌లను ఎప్పుడూ తాకలేదని స్కియావో స్పష్టం చేశారు. పలు మీడియా నివేదికలు పైలట్లను నిందించినప్పటికీ, ఈ సాంకేతిక సమస్యే దుర్ఘటనకు కారణమని ఆమె వెల్లడించారు.
పైలట్లపై నిందలు సరికాదు
ఈ క్రమంలో వాల్ స్ట్రీట్ జర్నల్ సహా వినిపిస్తున్న వాదనలను స్కియావో తోసిపుచ్చారు. పైలట్లు ఎటువంటి తప్పు చేయలేదన్నారు. విమాన సాఫ్ట్‌వేర్‌లోని లోపమే ఈ దుర్ఘటనకు కారణమన్నారు. ఈ ఘటనలో పైలట్లను నిందించడం సరికాదని, విచారణ ఫలితాలను ఆధారంగా చేసుకోవాలని ఆమె సూచించారు.
విచారణలో ఏం తేలింది?
ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకుని, అక్కడి నుంచి లండన్ గాట్విక్‌కు బయలుదేరింది. టేకాఫ్‌కు ముందు, విమానంలో స్టెబిలైజర్‌లో సమస్య ఉన్నట్లు క్రూ సభ్యులు గుర్తించారు. అహ్మదాబాద్‌లో ఇంజనీర్లు ఈ సమస్యను సరిచేశారని జూలై 12న విడుదలైన ప్రాథమిక విచారణ నివేదిక తెలిపింది. అయినప్పటికీ, టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానం కుప్పకూలింది. దీనిపై భారతదేశ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విచారణ జరుపుతోంది.
ఇప్పుడు ఏం జరుగుతోంది?
AAIB డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్, అంతర్జాతీయ మీడియా నివేదికలను ఖండిస్తూ, విచారణ పూర్తి కాకముందే ఊహాగానాలు చేయడం సరికాదన్నారు. పలు మీడియా సంస్థలు ధృవీకరించని సమాచారంతో నిర్ణయాలకు వస్తున్నాయని, ఇది బాధ్యతారహిత చర్య అని ఆయన పేర్కొన్నారు. ఈ దుర్ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతోంది. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లోని సాంకేతిక లోపాలపై దృష్టి సారించిన AAIB, ఈ సమస్యలను లోతుగా పరిశీలిస్తోంది. పైలట్లను నిందించే బదులు, విమాన తయారీ సంస్థలు, సాఫ్ట్‌వేర్ డిజైన్‌పై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.