ఢిల్లీ, 14 అక్టోబర్ (జనవిజన్ న్యూస్): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యార్థుల్లో వెలుగులు నింపుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీ వేదికగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘విద్యార్థులతో రాష్ట్రప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. రెండు నెలలు ఓపిక పట్టాలని యువతను కోరుతున్నాను. భావోద్వానికి గురై ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నాపత్రాలు అమ్మడం బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తాం. పిల్లల ఆత్మహత్యలు తగ్గాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. కేసీఆర్‌ని గద్దెదించుతేనే రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కరమవుతాయి. సింగరేణి నియామకాలల్లో కూడా సరిగ్గా నిర్వర్తించలేకపోయారు. గ్రూప్ వన్, గ్రూప్ టు పరీక్షలు వాయిదా వల్ల పిల్లలు మనస్థాపంతో ఉన్నారు. పకడ్బందీగా నిర్వహించాల్సిన గ్రూప్ పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్లక్ష్యం చేసింది.పదో తరగతి పరీక్షలు మొదలు గ్రూప్ 1 పరీక్షల వరకు దేన్ని సక్రమంగా నిర్వహించలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. సీఎం సమీక్షించి, విద్యార్థుల్లో నమ్మకం కల్గించేలా చర్యలు ఉండాలి. కానీ సీఎం ఎన్నికల మీద, పార్టీలో చేరికలు, బీ ఫామ్‌లు అందించడం, ప్రచారం మీదే ధ్యాస ఉంది.’’ అని రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం..
‘‘ప్రవల్లిక ఆత్మహత్య ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్య. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ఆత్మహత్యలకు ఎవరు పాల్పడవద్దు. డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలపై తొలి సంతకం చేస్తాం, ఎవరు అధైర్యపడొద్దు. ఆత్మహత్యలు అగాలంటే కేసీఆర్ గద్దె దిగాల్సిందే. మీకు అండగా కాంగ్రెస్ ఉంటుంది, నేను హైదరాబాద్ వెళ్లగానే కార్యచరణ రూపొందిస్తా. మాతో కలిసి రండి, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. మరో గ్యారెంటీ ఇస్తున్నాం, తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందిస్తా. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రవళికపై అభాండాలు వేస్తున్నారు. 24 గంటల్లోనే విచారణ పూర్తి చేసారా? పేపర్ లీక్ ఘటనపై ఏడాది అయిన ఎందుకు పూర్తికాలేదు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు విచారణ చేస్తే ఇట్లానే వస్తాయి. చనిపోయిన అమ్మాయి మీద అభాండాలు వేయడం ప్రభుత్వ నీచమైన మనస్తత్వాన్ని బయటపెడుతోంది. ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడు చనిపోయిన వారిపై అభాండాలు వేస్తోంది’’ అని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Tags
జాతీయ-వార్తలు-delhi