అధికారంలోకి రాగానే విలీన గ్రామాలను గ్రామపంచాయతీలుగా గుర్తిస్తాం: కాంగ్రెస్ నాయకులు

Editor Dayanand Jana
రాజన్నసిరిసిల్ల, 17 అక్టోబర్ (జనవిజన్ న్యూస్): ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 12వ వార్డు చంద్రంపేటలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల బ్లాక్ అద్యక్షుడు సూర దేవరాజ్ ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను చూపుతూ ఇంటింటా ప్రచారం చేశారు. 'గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే గతి లేదు ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏం నెరవేరుస్తార'ని ఎద్దేవా చేసారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. అధికార పార్టీ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసపూరిత మాటలతో మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను చూసే అధికార పార్టీ మేనిఫెస్టోను ప్రకటించిందని అన్నారు. నాయకుల స్వార్థపూరిత రాజకీయాల కోసం పచ్చగా ఉన్న పల్లెటూర్లను సిరిసిల్ల మున్సిపల్ లో కలిపి వీలీన గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల బ్లాక్ అధ్యక్షుడు సూర దేవరాజ్. సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన నాటి నుంచి వీలీన గ్రామాలలో ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లించడం సామాన్యులకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం కోసం అనుమతుల విషయంలో లక్షల్లో ఖర్చు అవుతుందని అన్నారు. గ్రామపంచాయతీలుగా ఉండగా అత్యంత ఖర్చుతో ఇంటి పర్మిషన్లు వచ్చేవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విలీన గ్రామాలను తిరిగి గ్రామపంచాయతీలుగా చేస్తామని అన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు ఆకునూరి బాలరాజు, యూత్ నాయకులు అన్నల్ దాస్ బాను, పిట్టల దేవరాజ్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, మంగ కిరణ్, బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post