రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులతోపాటు తాజాగా 13 రకాల అత్యవసర సేవల సిబ్బందికి సైతం తపాలా ఓటు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఎన్నికల సంఘం వీరందరికీ ఇంటి వద్దే ఓటేసే అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మొత్తం అయిదు విభాగాల వారికి తపాలా ఓటు అవకాశముంది. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే ఆయా విభాగాల్లోని వారంతా తగిన ధ్రువపత్రాలతో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి(ఆర్వో) దరఖాస్తు చేసుకోవాలి. వీరిలో మొదటి విభాగంలో... సర్వీసు ఓటర్లు అంటే సైన్యంలో పని చేసే ఉద్యోగులు. రెండు... ప్రత్యేక ఓటర్లు అంటే రాష్ట్రపతి, ఇతరత్రా కార్యాలయాల్లో పని చేసే స్థానికులు. మూడు... పీడీ యాక్టు కింద అరెస్టయిన వారు, నాలుగు... ఎన్నికల విధుల్లోని ఉద్యోగులు, సిబ్బంది ఉంటారు. అయిదో విభాగంలో... నోటిఫైడ్ ఓటర్లుగా 80 ఏళ్లు పైబడిన వారు, 40 శాతానికి మించి వైకల్యం కలిగిన 21 రకాల దివ్యాంగులు ఉన్నారు. వీరి ఇళ్లకు బీఎల్‌ఓలు వస్తారు. తపాలా ఓటు వేయడానికి ఇష్టపడే వారికి ఫారం-12డీ ఇస్తారు. ఒకసారి తపాలా ఓటుకు ఆర్వో ఆమోదం తెలిపితే, సంబంధిత ఓటరు ఇక పోలింగ్ కేంద్రంలో నేరుగా ఓటు వేయడానికి వీలుండదు.
నోటిఫైడ్ ఓటర్ల జాబితా విస్తరణ
నోటిఫైడ్ ఓటర్ల జాబితాలో ఎన్నికల విధుల కారణంగా ఓటు వేయలేకపోయే అత్యవసర సేవల ఉద్యోగులకు తాజాగా స్థానం కల్పించారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల సమయంలో దేశంలోనే మొదటిసారి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏఏఐ(ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), ఎఫ్‌సీఐ(ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), దూరదర్శన్, పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో), ఏఐఆర్(ఆల్ ఇండియా రేడియో)... బీఎస్‌ఎన్‌ఎల్, భారతీయ రైల్వే, ఆర్టీసీ... విద్యుత్తు, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, ఆర్టీసీ, ఆహారం, పౌర సరఫరాలు, అగ్నిమాపక శాఖలు, కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరించే పాత్రికేయులను ఈ విభాగంలో చేర్చారు. ఆయా సంస్థలు రిటర్నింగ్ అధికారుల ద్వారా ఉద్యోగులకు ఫారం-12డీ ఇప్పించి, తపాలా ఓటు సదుపాయాన్ని కల్పించొచ్చు.
ఎలా భద్రపరుస్తారంటే...
పోలింగ్‌కు ముందే, ఏవేని రెండు తేదీల్లో తపాలా ఓటు వేసేందుకు ఆర్వో అవకాశమిస్తారు. అనుకూలమైన రోజును ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఓటరుకు ఉంటుంది. రాజకీయ పార్టీలకు ఆయా తేదీలు, సమయం, తపాలా ఓటర్ల వివరాలు చేరతాయి. అవసరమనుకుంటే ఏజెంట్లు కూడా రావచ్చు. ఈ మొత్తం ప్రక్రియ వీడియోలో చిత్రీకరిస్తారు. ఓటరు ఇంట్లోనే పోలింగ్ కంపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసి, బ్యాలెట్ పేపరు ఇస్తారు. ఎవరికీ కనిపించకుండా నచ్చిన అభ్యర్థికి ఓటు వేశాక బ్యాలెట్ పేపరును చిన్నపాటి కవరు (ఫారం-13బీ)లో ఉంచి, సీల్ వేసి ఎన్నికల అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. తాము ఓటు వేసినట్లు ధ్రువీకరణపత్రంపై (ఫారం-13ఏ) సంతకం చేయాలి. అనంతరం ఈ రెండింటిని ఎన్నికల అధికారి మరో పెద్ద కవరులో (ఫారం-13సీ) వేసి... ఓటరు సమక్షంలోనే సీల్ చేస్తారు. ఇలా సేకరించిన తపాలా ఓట్లు సాయంత్రం రిటర్నింగ్ అధికారికి చేరుతాయి.
Tags
Elections