బంగాళాఖాతంలో తుపానుగా అల్పపీడనం.. 'హమూన్‌'గా పేరు

భువనేశ్వర్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రం తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీనికి 'హమూన్‌'గా పేరు పెట్టారు.ఈ పేరును ఇరాన్‌ సూచించింది. హమూన్‌ తుపాను (Hamoon cyclone) కారణంగా భారత తీరంపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేసింది. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ఒడిశాలోని పారాదీప్‌కు 230 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని ధిగాకు 360 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్‌లోని హెపుపరాకు 510 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది.

రాబోయే 12 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఈ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అక్టోబర్‌ 25న బంగ్లాదేశ్‌లోని హెపుపరా, చిట్టగాంగ్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుపాను కారణంగా రాబోయే రెండ్రోజుల్లో ఒడిశాలో ఓ మోస్తరు వర్షపాతం నమోదు కావొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. గాలులు కూడా వీస్తాయని పేర్కొన్నారు. తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఒడిశా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఒడిశాపై నేరుగా ప్రభావం ఉండనప్పటికీ.. జాలర్లు ఎవరూ బుధవారం వరకు వేటకెళ్లొద్దని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు సూచించారు. అటు పశ్చిమ బెంగాల్‌లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్థానిక వాతావరణ విభాగం వెల్లడించింది.

Post a Comment

Previous Post Next Post