రేపటితో రాజన్న సిరిసిల్ల జిల్ల ఆవిర్భావానికి పదేళ్లు.. ప్రత్యేక కథనం

రేపటితో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు.. ప్రత్యేక కథనం

రాజన్న సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమంలో చొక్కాల రాము పోరాటం.. 

జైలు జీవితం నుంచి జిల్లా ఆవిర్భావం వరకు!
జిల్లా ఏర్పాటుకు పదేళ్లు.. 

ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాలను గుర్తుచేసుకుంటున్న ప్రజలు

రాజన్న సిరిసిల్ల, 9 అక్టోబర్ (జనవిజన్): రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా జిల్లా సాధన కోసం సాగిన ఉద్యమం, అందులో పాల్గొన్న ఉద్యమకారుల పోరాటాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. జిల్లా ఏర్పాటు కోసం నాడు జరిగిన ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు, అరెస్టులు.. ఇలా ఎన్నో పరిణామాల మధ్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారిలో చొక్కాల రాము పేరు ప్రత్యేకంగా ప్రస్తావించదగినది. జిల్లా సాధన కోసం పోరాడిన క్రమంలో ఆయన జైలుకు వెళ్లడం ఉద్యమ సమయంలో ఎదుర్కొన్న పరిణామాలకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది.


అన్ని వర్గాలను ఏకం చేసిన జిల్లా ఉద్యమం
రాజన్న సిరిసిల్లను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో నాడు వివిధ వర్గాలు ఉద్యమ బాట పట్టాయి. న్యాయవాదులు, వ్యాపారస్తులు, కుల సంఘాలు, వివిధ వాహనాల యూనియన్లు, విద్యార్థి సంఘాలు, తమ తమ స్థాయుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు, బంద్‌లు, ఆందోళనలతో జిల్లా సాధన ఉద్యమం ఉధృతమైంది.
నాటి రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), సీపీఎం, సీపీఐ, తెలుగుదేశం పార్టీ తదితర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా వివిధ రూపాల్లో ఉద్యమంలో భాగస్వాములయ్యారు. పార్టీలు, సంఘాలు, వృత్తులతో సంబంధం లేకుండా జిల్లా ఏర్పాటు ఆకాంక్ష అనేక వర్గాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది.


సిరిసిల్ల పట్టణ పరిధిలోని పలు కూడళ్ల వద్ద ఒక రాజకీయ పార్టీల నాయకులు ఒకచోట, కుల సంఘాలు ఒకచోట, పలు వాహన యూనియందు మరోచోట, న్యాయవాదులు ఇంకొక చోట ఇలా వివిధ వర్గాలు రోజువారి నిరసన కార్యక్రమాలలో భాగంగా టెంట్లు వేసుకుని తమ డిమాండ్లను, జిల్లా ఏర్పడాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. ఒకానొక సందర్భంలో అంబేద్కర్ చౌక్ వద్ద సీనియర్ నాయకుడు గాజుల బాలయ్య, మరో యువ నాయకుడు మనోజ్ ఆమరణ దీక్షకు సైతం దిగి తమ శాంతియుత నిరసన ప్రదర్శనను నిర్వహించారు. పలు వాహనాల యూనియన్లు తమ యూనియన్లలోని వాహనాలతో పట్టణంలో భారీ ర్యాలీలు నిర్వహించాయి. పలు పాఠశాలల నిర్వహకులు తమ పాఠశాల విద్యార్థులతో జిల్లా ఏర్పాటు అవసరాన్ని తెలిపేలా పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు.


జైలుకు వెళ్లినా వెనక్కి తగ్గని ఉద్యమ స్ఫూర్తి
జిల్లా సాధన కోసం జరిగిన పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రతినిధులతో పాటు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చొక్కాల రాము, బహుజన సమాజ్ పార్టీ తరపున లింగంపల్లి మధుకర్ లు పాల్గొనడం, ఆ క్రమంలో జైలుకు వెళ్లడం వారి ఉద్యమ ప్రస్థానంలో ప్రస్తావించాల్సిన అంశం. ఒక జిల్లా ఏర్పాటు వెనుక కేవలం ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాకుండా, దాని కోసం రోడ్డెక్కిన ప్రజల ఆకాంక్షలు, ఆందోళనలు, వ్యక్తిగతంగా ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా ఉంటాయని ఈ ఉద్యమ చరిత్ర గుర్తుచేస్తోంది.


జిల్లా సాధన కోసం పోరాడిన ప్రతి ఒక్కరి పాత్రను గుర్తించడం, ఉద్యమంలో పాల్గొన్న వారి అనుభవాలను భవిష్యత్ తరాలకు అందించడం నేటి తరానికి అవసరం. చొక్కాల రాము, లింగంపల్లి మధుకర్ వంటి ఉద్యమకారుల పోరాటాలను స్మరించుకోవడం అంటే జిల్లా ఆవిర్భావం వెనుక ఉన్న ప్రజా ఉద్యమాన్ని గుర్తుచేసుకోవడమే.


పదేళ్ల జిల్లా ప్రస్థానంలో ఉద్యమకారుల పాత్రకు గుర్తింపు ఏదీ?
జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న ఈ సందర్భం వేడుకలకే పరిమితం కాకుండా, జిల్లా సాధన కోసం శ్రమించిన ఉద్యమకారుల సేవలను గుర్తుచేసుకునే సందర్భంగానూ మారాలి. ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులు, వ్యాపారులు, విద్యార్థులు, సంఘాల ప్రతినిధులు, కార్మికులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల కృషిని చరిత్రలో నమోదు చేయాల్సిన అవసరం ఉంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావం ఒక పరిపాలనా మార్పు మాత్రమే కాదు.. దాని వెనుక ప్రజల ఆకాంక్షలు, సమిష్టి పోరాటాలు, ఉద్యమకారుల అనుభవాలు ఉన్నాయి. ఆ పోరాటాల జ్ఞాపకాలను పదిలపరచి, చొక్కాల రాము వంటి ఉద్యమకారుల పాత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయడం జిల్లా చరిత్రకు తగిన గుర్తింపు ఇవ్వడమే అవుతుంది.

ఇది జన విజన్ టీవీ ప్రత్యేక కథనం..

Post a Comment

Previous Post Next Post