వరి నుంచి ఉద్యానవన పంటల వైపు రైతు

వరి నుంచి ఉద్యానవన పంటల వైపు రైతు

విభిన్న పంటలు.. మంచి ఆదాయం

ఆయిల్ పామ్ లో అంతర పంటగా మూడున్నర ఎకరాల్లో నాలుగు రకాల కూరగాయలు, పూల తోటల సాగు

బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో రైతు కడుదుల రాజు - అంజలి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఆయిల్ పామ్ లో వివిధ పంటల సాగు చేస్తుండడంపై అభినందనలు

---------------------------------
బోయినపల్లి, అక్టోబర్ -13
----------------------------------


సంప్రదాయ వరిసాగును వదిలి .. మూడున్నర ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటలో అంతర పంటగా నాలుగు రకాల కూరగాయలు, పూల తోటలు సాగు చేస్తున్నారు. పంట మార్పిడితో నేల సారం పెరగగా, మేలైన దిగుబడి వస్తూ .. మంచి ఆదాయం సమకూరుతుంది. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించి.. రైతును అభినందించారు. 

బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో నీలోజుపల్లి గ్రామానికి చెందిన రైతు కడుదుల రాజు- అంజలి తమకు ఉన్న 8 ఎకరాల్లో వరి సాగు చేసేవారు. ఎల్ నినో ప్రభావం, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు రాజు వరిని వదిలి దాదాపు 3.5 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ.. అంతర పంటలుగా బెండకాయ, టమాట, మిర్చి, కాలిఫ్లవర్, అలాగే బంతి, పట్టుకుచ్చులు, వేరు శెనగ వేశారు. తక్కువ నీటితో ఆయా కూరగాయలు పండిస్తూ.. మంచి దిగుబడి, ఆదాయం పొందుతున్నారు. 

బెండకాయ విత్తనాలు నాటిన తర్వాత రెండు నెలల నుంచి దిగుబడి మొదలై 45 రోజులు నుంచి 60 రోజుల వరకు పంట ఉత్పత్తి వస్తుందని, టమాట నాటిన రెండు నెలల తర్వాత దిగుబడి మొదలై 60 నుంచి 70 రోజుల పాటు పంట ఉత్పత్తి వస్తుందని, మిర్చి నాటిన రెండు నెలల తర్వాత దిగుబడి మొదలై దాదాపు నాలుగు నెలల పాటు పంట ఉత్పత్తి వస్తుందని, కాలీఫ్లవర్ నాటిన మూడు నెలల తర్వాత ఒకేసారి దిగుబడి చేతికి వస్తుందని రైతు రాజు చెప్పారు.

బతుకమ్మ, దసరా, దీపావళి నేపథ్యంలో బంతిపూలను సాగు చేస్తున్నారు. ఆయా పండుగలు నేపథ్యంలో అదనపు ఆదాయం వస్తుంది. బతుకమ్మ కోసం ప్రత్యేకంగా పట్టుకుచ్చులు సాగు చేశారు. అలాగే కొంత విస్తీర్ణంలో వేరు శెనగ సాగు చేస్తున్నారు. 

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి


రైతు రాజు -అంజలి సాగు చేస్తున్న ఆయా కూరగాయలు, పూల తోటలను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. కూరగాయలు దిగుబడి చూసి.. ఎన్ని రోజుల పాటు ఉత్పత్తి వస్తుందని? ఆదాయం ఎంత వస్తుందో? ఆరా తీశారు. తాను వరి సాగు చేసినప్పుడు ఎకరానికి రూ. 50 వేల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు కూరగాయల సాగుతో ఎకరానికి దాదాపు రూ. లక్ష వరకు ఆదాయం వస్తుందని రైతు తెలిపారు. ఆ రైతు దంపతులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసాయని, భూగర్భ జలాలు తగ్గుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. వరికి బదులుగా కూరగాయలు, కందులు, పెసర్లు, మినుములు, మొక్కజొన్న, ఆముదం, నువ్వులు, వేరు శెనగ, శెనిగెలు, పొద్దు తిరుగుడు, ఆయిల్ పామ్ సాగు కోరారు. ఉద్యానవన పంటల సాగు కోసం డ్రిప్ ఇరిగేషన్ వాడాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అధికారుల సూచనల మేరకు పంటలు సాగు చేయాలని సూచించారు. యాసంగి లో రైతు రాజు మొత్తం విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు.

పరిశీలనలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ షరీఫోద్దీన్, ఇంచార్జి ఎంపీడీఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post