నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డు సమర్పించాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

 నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డు సమర్పించాలి


ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్


తంగళ్ళపల్లి మండలంలోని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్



తంగళ్ళపల్లి, 12 సెప్టెంబర్ 2026: ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా తంగళ్ళపల్లి మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్న 185, 186, 187, 188, 189, 190, 191 పోలింగ్ బూత్‌ లలో బీఎల్ఏ సమక్షంలో బూత్ లెవెల్ అధికారులు చేపడుతున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి, పలు సూచనలు చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును నిర్ధారించుకునేందుకు ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి సంబంధిత బీఎల్ఓ లకు సమర్పించాలని అన్నారు. 

అక్టోబర్ 1, 2026 వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండే యువతీ, యువకులు ఎంత మంది ఓటు హక్కు కోసం చేసిన దరఖాస్తుల వివరాలతో పాటు,  నో మ్యాపింగ్ ఓటర్లు, అనామలీస్ ఓటర్లు వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. మండలంలో ఉన్న అన్ని పోలింగ్ బూత్ ల పరిధిలో 9,712 అనామలీస్ ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. 

క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులతో పాటు సంబంధిత బీఎల్ఏ లు నోటీసులు అందిన ఓటర్లకు అవగాహన కల్పించి, తమ ధృవీకరణ పత్రాలు సమర్పించేలా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలని, సంబంధిత తహసీల్దార్లు, బీఎల్ఓ సూపర్ వైజర్లు అందుబాటులో ఉండి బీఎల్ఓ లకు సూచనలు అందిస్తూ ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు.  

పరిశీలనలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post