రాజన్న ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలి: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలి: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి, బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణం, 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

వివిధ శాఖల అధికారులతో ఐడీఓసీలో సమీక్ష

వేములవాడ, సెప్టెంబర్ -11- 2026: వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

వేములవాడ పట్టణంలో వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఆర్ అండ్ బీ, ఇతర శాఖల అధికారులతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులపై ఆరా తీశారు. 

వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మురికి నీటి కాలువ, విద్యుత్ టవర్ల నిర్మాణం, రోడ్డు నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఒక్కో పనిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో అడిగి తెలుసుకున్నారు. 


ఆయా శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధునాతన గోశాల పురోగతిపై వివరాలు సేకరించారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, నిర్మాణ ప్రక్రియలో జాప్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిత్యాన్నదాన సత్రం నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని తెలిపారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసేందుకు మరింత మంది కూలీల సంఖ్యను పెంచాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 

అనంతరం బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులను పరిశీలించిన కలెక్టర్ గడువులోగా ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పనులు పూర్తి చేసేలా చూడాలని సూచించారు. 

వీటీఏడీఏ ఆద్వర్యంలో చేపట్టిన పనులను ఆయా శాఖల అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పరిశీలిం చాలని, పనులు వేగంగా పూర్తి అయ్యేలా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. 

కార్యక్రమాల్లో ఆలయ ఈఓ రమాదేవి, వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా నాయక్, డీఈ శాంతయ్య, మున్సిపల్ కమిషనర్ లోకేష్, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, తహసీల్దార్ జయంత్, రాజన్న ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post