'రైడ్' సినిమా తరహాలో నకిలీ సీబీఐ దాడులు... బంధువుకే టోకరా!
ఢిల్లీలో ఘటన..
సీబీఐ అధికారులుగా నటించి బంధువు ఇంట్లోంచి రూ.3 లక్షల నగదు, ఆభరణాల దోపిడీ
నిందితుల్లో ఒకరు 22 ఏళ్ల యువతి
ఢిల్లీలోని వజీరాబాద్‌లో నకిలీ సీబీఐ అధికారులుగా నటించి బంధువు ఇంట్లోంచి రూ. 3 లక్షల నగదు, ఆభరణాలను దోచుకున్న ఓ మహిళా ట్యూటర్‌తో పాటు ఆమె ఇద్దరు సహచరులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన జులై 10న సాయంత్రం 7:30 గంటల సమయంలో జరిగింది. అరెస్ట్ అయిన వారిలో 22 ఏళ్ల యువతి (కరవాల్ నగర్ నివాసి), కేశవ్ ప్రసాద్ (28), వివేక్ సింగ్ (20) ఉన్నారు.
వీరు ఇస్రత్ జమీల్ అనే బంధువు ఇంటిని లక్ష్యంగా చేసుకొని, "ఓఖ్లా బ్రాంచ్ నుంచి వచ్చిన సీబీఐ అధికారులం" అని చెప్పి ఇంట్లో సోదాలు చేశారు. ఇస్రత్ జమీల్ సీజర్ మెమో కోరగా, నిందితులు ఆమె కుమార్తె నోట్‌బుక్‌లో నకిలీ పేర్లతో సంతకాలు చేసి, ఆభరణాలు, నగదు తీసుకుని పరారయ్యారు. ఇస్రత్‌కు అనుమానం రావడంతో పోలీసులను సంప్రదించగా, వారు వచ్చేలోపు నిందితులు పరారయ్యారు.
వజీరాబాద్ పోలీసులు మోసం, దొంగతనం, హాని కలిగించేందుకు సన్నాహాలు చేసినట్లు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కేసు నమోదు చేశారు. జులై 18న మహిళ, కేశవ్ ప్రసాద్‌లను మస్సూరీలో, వివేక్ సింగ్‌ను హరిద్వార్ లో అరెస్ట్ చేశారు.పోలీసుల వివరణ ప్రకారం, నిందితులు ఇంట్లోని అల్మరా లాక్‌ను బద్దలు కొట్టి, బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ. 3 లక్షల నగదును తీసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా రూ. 1.75 లక్షల నగదు, 29 బంగారు/వెండి ఆభరణాలు, నేరంలో ఉపయోగించిన మోటార్‌సైకిల్, నిందితులు ధరించిన బట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సినిమాల్లో చూపించే దొంగతనాలను తలపించిందని, నిందితులు బాలీవుడ్ చిత్రం 'రైడ్' నుంచి స్ఫూర్తి పొంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు