తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పి తప్పినట్టే! ఇక పాఠశాలల్లోనే ఆధార్‌ అప్డేట్‌

తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పి తప్పినట్టే! ఇక పాఠశాలల్లోనే ఆధార్‌ అప్డేట్‌..!
పిల్లల ఆధార్‌ కార్డ్‌ కోసం తల్లిదండ్రులు పడే శ్రమ అంతా ఇంతా కాదు. పనులన్నీ మానుకొని..

 ఆధార్‌ సెంటర్‌లో క్యూలో నిల్చోని, వారి బర్త్‌ సర్టిఫికేట్‌, ఇతర పత్రాలన్నీ దగ్గర పెట్టుకొని..అబ్బో అదో పెద్ద ప్రాసెస్‌. పైగా ఐదేళ్లలోపు చిన్నారులకు బాల్‌ ఆధార్‌ మాత్రమే ఇస్తారు. ఐదేళ్ల తర్వాత దాన్ని మళ్లీ అప్డేట్‌ చేయించాలి. అది కూడా తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పి. ప్రస్తుతం ఆధార్‌ సెంటర్‌ అంటే గంటల తరబడి పడిగాపులు కాయాలనే చిరాకు అందరిలో కనిపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు Unique Identification Authority of India (UIDAI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై పిల్లల ఆధార్‌ కార్డ్‌ అప్డేట్‌ను వారి పాఠశాలల్లోనే జరిపేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది.

దేశంలో దాదాపు ఏడు కోట్ల మందికిపైగా పిల్లలు తమ వేలిముద్రలను ఆధార్‌ కార్డ్‌ కోసం ఇవ్వాల్సి ఉండడంతో వాటి సేకరణకు పాఠశాలలకే బయోమెట్రిక్‌ యంత్రాలను పంపించాలని UIDAI భావిస్తోంది. రెండు నెలల తర్వాత ఇది కార్యరూపం దాల్చనుంది. దశలవారీగా దీన్ని విస్తరించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పసికందులు మొదలు ఐదేళ్లలోపు చిన్నారులకు వారి బయోమెట్రిక్‌ వివరాలు తీసుకోకుండానే ఆధార్‌ సంఖ్యను కేటాయిస్తున్నారు. వారికి ఐదేళ్లు వచ్చాక ఫింగర్‌ ప్రింట్‌ ఇచ్చి కార్డ్‌ను అప్డేట్‌ చేసుకోవాలి. ఏడేళ్లు వచ్చిన తర్వాత కూడా ఇలా చేసుకోనివారి ఆధార్‌ సంఖ్యల తొలగింపు జరుగుతుందని UIDAI నిబంధనలు చెబుతున్నాయి.

5-7 ఏళ్ల మధ్యనైతే ఉచితంగా, ఆ తర్వాత రూ.100 రుసుముతో ఆధార్‌ కార్డ్‌ అప్‌డేట్‌ చేస్తారు. పాఠశాలల్లో ప్రవేశాలు, ప్రవేశ పరీక్షలకు నమోదు, ఉపకారవేతనాలు పొందడం, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు వంటివాటికి బయోమెట్రిక్‌ అప్డేట్‌తో ఉన్న ఆధార్‌ అవసరం కావడంతో పాఠశాలలకు వెళ్లి పిల్లల నుంచి బయోమెట్రిక్‌ సేకరించే ప్రణాళికతో ఉన్నామని UIDAI ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) భువనేశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా మొదలుపెడితే.. ఇక తల్లిదండ్రులకు ఆధార్‌ సెంటర్లలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తప్పనుంది. 

Post a Comment

Previous Post Next Post