కో లివింగ్ డేంజర్ కాలింగ్.. రాజధాని లో పెరుగుతున్న కో లివింగ్ కల్చర్
కాలానుగుణంగా తనను తాను మార్చుకొనే మన హైదరాబాద్లో ఓ సరికొత్త ట్రెండ్ వేగంగా దూసుకెళ్తాంది. అదే కో-లివింగ్ కల్చర్. విదేశాల నుంచి ఢిల్లీ, గుర్గావ్, ముంబై, పుణె, బెంగళూరు, చెన్నెలకు విస్తరించిన ఈ కల్చర్ నేడు భాగ్యనగరానికి కూడా పాకింది. తెలుగు రాష్ట్రాల్లోని వైజాగ్, విజయవాడ వంటి ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం రాజకీయ రచ్చకు, సామాజిక చర్చకు దారితీస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తోన్న ఈ విధానంపై ఇటీవల కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కో-లివింగ్ హాస్టళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వాదనకు మెజార్టీ ప్రజలు మద్దతు తెలుపుతుండగా పలువురు వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఇలాంటి హాస్టల్స్ ఉన్నా కూడా ఎవరికీ తెలిసేవి కాదు. కానీ, నిర్వాహకులు ప్రస్తుతం పబ్లిక్ గానే వీటి గురించి ప్రకటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో కోవిలింగ్ ట్రెండ్పై సండే స్పెషల్ స్టోరీ మీకోసం..
కో-లివింగ్ అంటే ఏంటి?
ఒకప్పుడు పరిచయం లేని అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవడాన్ని తప్పుపట్టేవారు. అందుకే స్కూళ్లు, కాలేజీలన్నీ వేర్వేరుగా ఉండేవి.
కాలక్రమంలో భాగంగా కో-ఎడ్యుకేషన్ వచ్చింది. అయితే వారికి హాస్టళ్లు మాత్రం వేర్వేరుగా ఉంటున్నాయి. దానికి అప్గ్రేడ్ వెర్షన్ రూపంలో కో-లివింగ్ వచ్చింది. రక్త సంబంధం, బంధుత్వం, వివాహ బంధం లాంటివి ఏమీ లేని అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే హాస్టల్/ఇంట్లో కలిసి ఉండటాన్నే కో-లివింగ్ అంటున్నారు. ఉన్నత చదువులు చదివేవారు, ఐటీ ఎంప్లాయిస్ ఎక్కువగా ఈ కల్చర్కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
లగ్జరీ సౌకర్యాలు.. దిమ్మతిరిగే రేట్లు!
యువతీ యువకులను ఆకర్షించేందుకు కో-లివింగ్ హాస్టళ్ల యజమానులు లగ్జరీ సౌకర్యాలను ఆఫర్ చేస్తున్నారు. బెడ్స్, టీవీ, ఫ్రిజ్, ఏసీ, వైఫై, వాషింగ్ మెషీన్, మినలర్ వాటర్, కిచెన్ సెటప్తో పాటు ఫర్నీచర్, స్విమ్మింగ్ పూల్ వంటి వాటిని కూడా అందిస్తున్నారు. వీటికి సౌకర్యాలను బట్టి హైదరాబాద్లో ఒక్కొక్కరి వద్ద రూ.8వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారు. రేట్లు భారీగా ఉన్నప్పటికీ కో-లివింగ్ కు ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, KPHB, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో కో-లివింగ్ స్పేసెస్ ఎక్కువగా ఉన్నాయి.
కో-లివింగ్ నైతికంగా కరెక్ట్ కాదు..
ఈ కల్చర్ మన దేశానికి సూట్ కాదని, యువత పెడదోవ పడుతుందని మెజార్టీ వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు. 18 ఏళ్లు నిండిన యువతీయువకులు కలిసి ఉండొచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఉన్నప్పటికీ నైతికంగా, భద్రతాపరంగా కరెక్ట్ కాదంటున్నారు. వారి మధ్య మనస్ఫర్థలు వచ్చినప్పుడు గతంలోని ఫొటోలు, వీడియోలను బయటపెడతామంటూ బెదిరింపులకు దిగే అవకాశం ఉందంటున్నారు. ఈ హాస్టళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ లేదని, కఠిన నిబంధనలు సైతం లేవని అంటున్నారు. అందువల్ల యువతులపై అఘాయిత్యాలు, క్రైమ్ రేట్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే కో-లివింగ్ జంటలు కేసులు పెట్టుకున్న ఉదంతాలు చాలా ఉన్నాయి.
హాస్టల్ నిర్వాహకుల దందా
కొందరు హాస్టల్ నిర్వాహకులు అమ్మాయిలను మీ రూమ్ మేట్గా సెట్ చేస్తామంటూ అబ్బాయిలను దోచుకుంటున్నారు. అదే సమయంలో కొందరు కో-లివింగ్ విషయం గురించి తల్లిదండ్రులకు చెబుతామంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. అలా జరిగేంత వరకు తమ పిల్లలు మరొకరితో కలిసి ఉంటున్నారనే విషయం పేరెంట్ కూ తెలియట్లేదు.
ట్రెండ్ పేరిట బోల్తా పడొద్దు
ట్రెండ్ ఫాలో అవ్వాలనో, ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతోనే, స్వేచ్ఛ దొరికిందనో కో-లివింగ్కు మొగ్గు చూపొద్దని పలువురు సూచిస్తున్నారు. అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలకు జీవితాంతం మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.
షేరింగ్, కేరింగ్ తప్ప మరే ఆలోచనా లేదు..
కలిసి ఉంటున్నారంటే శారీరక సంబంధమేనన్న ఆలోచన నుంచి బయటకు రావాలని పలువురు కో-లివింగ్ పార్ట్నర్స్ అంటున్నారు. కాలానుగుణంగా నైతిక విలువలు, సామాజిక కట్టుబాట్లు మారుతూ ఉంటాయని చెబుతున్నారు. తాము 6 నెలలుగా కలిసే ఉంటున్నామని, తమ మధ్య షేరింగ్, కేరింగ్ తప్ప మరే ఆలోచనలు లేవని వినయ్, రోజా(పేర్లు మార్చాం) పేర్కొన్నారు. కో-లివింగ్ వల్ల అండర్స్టాండింగ్, సర్దుకుపోయేతత్వం తెలుస్తుందని అన్నారు.
ఈ కల్చర్ విదేశాల్లో సాధారణమే
కో-లివింగ్ కల్చర్ విదేశాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. మన దేశం నుంచి చదువు, ఉద్యోగాల కోసం అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లేవారు ఇలా కో-లివింగ్్క మొగ్గు చూపుతున్నారు. ఒకే దేశం, ఒకే ప్రాంతం వాళ్లమనే భావన కోసం, ఖర్చులు తగ్గించుకోవడం, భద్రత, నమ్మకం తదితర కారణాలతో బాయ్స్, గర్ల్స్ కలిసే ఉంటున్నారు. వారి తల్లిదండ్రులకూ ఈ విషయం తెలుసు. దీన్ని సాధారణ విషయంగానే భావిస్తారు. సింగపూర్, మలేషియా, థాయ్లాండ్, జపాన్ లాంటి దేశాల్లో అయితే ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఒకే ఇంటిని షేర్ చేసుకుంటుంటారు. డబుల్, త్రిబుల్ బెడ్ రూం ఇళ్లలో రెండు మూడు చిన్న కుటుంబాలు కలిసి ఉంటుంటాయి. కిచెన్, లివింగ్ ఏరియాను షేర్ చేసుకుంటాయి.