సెక్స్ సమ్మతి వయసు 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలి'- సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి
లైంగిక కార్యకలాపాలకు సమ్మతి వయసు 16 ఏళ్లకు తగ్గించాలని సుప్రీంకోర్టుకు వినతి
పోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు సమ్మతి తెలిపే వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ విజ్ఞప్తి చేశారు. పోక్సో చట్టం 2012, ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం 16-18 ఏళ్ల వయసులో ఉన్నవారి లైంగిక కార్యకలాపాలను పూర్తిగా నేరంగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో ఆమె వాదనలు వినిపించారు. ప్రస్తుత చట్టం కౌమారదశలో ఉన్నవారి మధ్య ఏకాభిప్రాయ ప్రేమ సంబంధాలను నేరంగా పరిగణిస్తుందని, ఇది వారి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుందని అభిప్రాయపడ్డారు.
'చర్చ జరగకుండానే సెక్స్ సమ్మతి వయసు పెంపు'
"పోక్సో చట్టం కౌమారదశలో ఉన్నవారి మధ్య ఏకాభిప్రాయ సంబంధాలను తప్పుగా చూపిస్తోంది. వారి స్వయంప్రతిపత్తి, పరిపక్వత, సమ్మతిని విస్మరిస్తుంది. 16- 18 సంవత్సరాలకు సమ్మతి వయసును పెంచడాన్ని సమర్థించడానికి ఎటువంటి హేతుబద్ధమైన కారణం లేదా అనుభావిక డేటా లేదు. చర్చ జరగకుండానే సెక్స్ సమ్మతి వయసును 18ఏళ్లకు పెంచారు. లైంగిక కార్యకలాపాల సమ్మతి వయసు 16ఏళ్లని జస్టిస్ వర్మ కమిటీ చేసిన సిఫార్సుకు ఇది విరుద్ధంగా ఉంది. ప్రస్తుతం కౌమారదశలో ఉన్నవారు ముందుగానే యుక్తవయస్సును పొందుతారు. వారు తమకు నచ్చిన ప్రేమ, లైంగిక సంబంధాలను ఏర్పరచుకోగలరు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నుంచి వచ్చిన ఫలితాలతో సహా శాస్త్రీయ, సామాజిక డేటా టీనేజర్లలో లైంగిక కార్యకలాపాలు అసాధారణం కాదని సూచిస్తున్నాయి. 2017- 2021 మధ్య 16-18 ఏళ్ల వయసు గల మైనర్లపై పోక్సో కేసులు 180 శాతం పెరిగాయి." అని ఇందిరా జైసింగ్ తెలిపారు.
చాలా పోక్సో కేసు ఫిర్యాదులను బాధితులు కాకుండా, వారి తల్లిదండ్రులే చేశారని ఇందిరా జైసింగ్ తెలిపారు. వీటిలో చాలా వరకు కులాంతర లేదా మతాంతర సంబంధాలకు సంబంధించివేనన్నారు. "ఏకాభిప్రాయ లైంగికతను నేరంగా పరిగణించడం యువ జంటలను బహిరంగ చర్చలు, విద్యకు దూరం చేయడమే. 16- 18 ఏళ్ల ఏజ్ గల కౌమారదశలో ఉన్నవారి మధ్య ఏకాభిప్రాయ లైంగిక చర్యలను పోక్సో, ఐపీసీ సెక్షన్ల కింద విచారణ నుంచి మినహాయించాలి. దీన్ని చట్టంలో చేర్చాలి. టీనేజర్ల మధ్య లైంగిక చర్యను నేరంగా పరిగణించడం ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం. పిల్లల ప్రయోజనాలకు విరుద్ధం. లైంగిక కార్యకలాపాల విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు కౌమార దశలో ఉన్నవారికి ఉంది." అని ఇందిరా జైసింగ్ వ్యాఖ్యానించారు.
హైకోర్టుల వ్యాఖ్యలు ఉదహరింపు
బొంబాయి, మద్రాస్, మేఘాలయతో సహా వివిధ హైకోర్టులు పోక్సో చట్టం గురించి గతంలో చేసిన వ్యాఖ్యలను ఇందిరా జైసింగ్ ఉదహరించారు. పోక్సో చట్టం కింద కౌమారదశలో ఉన్న అబ్బాయిలపై విచారణ జరపడంపై అసంతృప్తి వ్యక్తం చేశారని గుర్తు చేశారు. మైనర్లతో సంబంధం ఉన్న అన్ని లైంగిక చర్యలు బలవంతం కాదని తెలిపాయన్నారు. పోక్సో చట్టం దుర్వినియోగం, ఏకాభిప్రాయ సంబంధాల మధ్య తేడాను గుర్తించాలని పలు హైకోర్టులు నొక్కిచెప్పాయన్నారు. "16-18 ఏళ్ల వయసు గల కౌమారదశలో ఉన్నవారి మధ్య ఏకాభిప్రాయ లైంగిక చర్య దుర్వినియోగం కాదు. పోక్సో, అత్యాచార చట్టాల పరిధి నుంచి వారిని మినహాయించాలి. కౌమారదశలో ఉన్నవారు సురక్షితమైన వైద్య సంరక్షణ పొందకుండా నిరోధించే పోక్సో చట్టంలోని సెక్షన్ 19ని సమీక్షించాలి." అని ఇందిరా తెలిపారు.
లైంగిక కార్యకలాపాలకు అంగీకారం తెలిపే వయసు 18 ఏళ్లు
పోక్సో చట్టం ప్రకారం ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం విషయంలో సమ్మతి వయసుపై కొన్నాళ్ల క్రితం లా కమిషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంగీకారం తెలిపే కనీస వయసు 18 సంవత్సరాల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలనే వాదనను తిరస్కరించింది. పోక్సో చట్టం ప్రకారం ప్రస్తుతమున్న సమ్మతి వయసును మార్చడం అంత మంచిది కాదని పేర్కొంది.