గడప గడపకు వెళ్లండి.. చేసిన మంచిని చెప్పండి.. వైసీపీ నేతలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు..

Posted by Chief Editor Dayanand Jana
అమరావతి,11 అక్టోబర్(జనవిజన్ న్యూస్): వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు జరిగిన మంచిని.. క్షేత్రస్థాయికి వెళ్లి మరీ తెలియజెప్పాలని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో ఆయన భేటీ నిర్వహించారు. వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాల్లో భాగంగా.. ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ యాత్ర పేరుతో బస్సు యాత్రలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. దసరా పండుగ ముగించుకుని ఈ నెల 26వ తేదీ నుంచి బస్సు యాత్రలు మొదలుపెట్టాలి. ప్రతీ నియోజకవర్గంలోనూ సమావేశాలు జరగాలి. మూడు ప్రాంతాల నుంచి ఒక్కో మీటింగ్‌చొప్పున.. ప్రతిరోజూ మూడు మీటింగ్‌లు నిర్వహించాలి. ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమం. దీన్ని విజయవంతం చేయాలంటూ పార్టీ శ్రేణులను జగన్‌ ఆదేశించారు.

రెండు నెలల పాటు యాత్రలు..

వచ్చే రెండు నెలలపాటు బస్సు యాత్రలు జరగాలి. నియోజకవర్గాల వారీగా సమావేశాల తేదీ, స్థలం.. ఇలా పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలి. బస్సు యాత్ర మీటింగ్స్‌లో స్థానిక ఎమ్మెల్యే, పార్టీ ఇంఛార్జితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు మాట్లాడాలి. 52 నెలల పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును ఈ సమావేశాల ద్వారా వివరించి ఆయా వర్గాలకు మరింత చేరువ కావాలి. వచ్చే ఎన్నికలు పేదవాడికి, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది కేస్ట్‌ వార్‌ కాదు…క్లాస్‌ వార్‌.. కాబట్టి.. పేదవాడు మన పార్టీని ఓన్‌ చేసుకోవాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్‌. సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం అంశాలను ప్రస్తావిస్తూ ఈ బస్సు యాత్ర జరగాలంటూ నేతలకు మార్గ నిర్దేశం చేశారు జగన్‌. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగే అవగాహనా సమావేశాలకు గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వాలంటీర్లు హాజరయ్యేలా చూడాలన్నారు ముఖ్యమంత్రి. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను రీజినల్ కో-ఆర్డినేటర్లు సందర్శించాలని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమం సమర్థవంతంగా జరిగేలా చూడాలని నేతలకు చెప్పారు జగన్‌.

ముగ్గురి నియామకం
బస్సు యాత్రలను విజయవంతం చేసేందుకు.. ప్రాంతాలవారీగా బాధ్యుల్ని సీఎం జగన్‌ నియమించారు. బస్సు యాత్ర మీటింగ్‌ ఏర్పాట్లను సమన్వయ పర్చడానికి కూడా ముగ్గురు పార్టీ నాయకుల్ని నియమించారు. ఈ భేటీకి విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మర్రి రాజశేఖర్‌, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, తలశిల రఘరామ్‌, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు హాజరయ్యారు. పేదోడి ప్రభుత్వం అనే పొలిటికల్ ఫార్ములాతో వైసీపీ సర్కార్‌ దూసుకెళ్తోంది. ఈ బస్సు యాత్రతో మ్యాగ్జిమమ్‌ పొలిటికల్‌ మైలేజ్‌ వచ్చేలా ముందుకు సాగుతోంది వైసీపీ.

Post a Comment

Previous Post Next Post