రాత్రి 10 తర్వాత ఉదయం 6 వరకు మైకులు, సభలు, ర్యాలీలపై నిషేధం
Posted by Chief Editor Dayanand Jana
హైదరాబాద్,11 అక్టోబర్(జనవిజన్ న్యూస్): తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రాజకీయ పార్టీలు పాటించాల్సిన నియమాలపై కేంద్రం ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులకు లౌడ్ స్పీకర్లు అనుమతి లేదని స్పష్టంచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఎన్నికల నియమావళిలో కీలక అంశాలు
ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో రాజకీయ ప్రచారాలు, ఆ పరిసరాల్లో ర్యాలీలకు అనుమతి లేదు.ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాలి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలలోపు సభలు, ర్యాలీలు నిషేధం.
వాహన చట్టానికి లోబడే వాహనాలకు లౌడ్‌స్పీకర్లు అమర్చుకోవాలి. వాహనాల బయట డిజైన్ చేసేటప్పుడు నిబంధనలు పాటించాలి. ఇందుకు సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలి. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థి పేరుతో అనుమతి తీసుకున్న వాహనాన్ని మాత్రమే వినియోగించాలి. స్టార్ క్యాంపెయినర్ల వాహనాలకు ముందస్తుగానే ఈసీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఎవరి పేరుతో అయితే అనుమతి తీసుకున్నారో. ఆ వాహనాన్ని ఆ వ్యక్తి మాత్రమే వినియోగించాలి.
పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎన్నికల ప్రచారాలు చేయకూడదు.పోలింగ్ స్టేషన్‌లోకి భద్రతా సిబ్బందిని అనుమతించరు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే భద్రతా సిబ్బంది వేచిచూడాలి. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి పత్రికలు, టెలివిజన్‌లలో ఎన్నికల ప్రచారాలకు సంబంధించినవి ప్రసారం చేయకూడదు. ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడానికి ముందే ప్రారంభమైన పథకాలు, కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు. క్రిటికల్ ఇల్‌నెస్‌తో బాధపడేవారికి వైద్య సదుపాయం, వైద్యం కోసం నగదు సాయం చేయాలి అనుకుంటే తగిన అనుమతులు తీసుకుని చేయవచ్చు.
Tags
తెలంగాణ