సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రగతికి కొత్త దారులు..
నేత కార్మికులకు రుణమాఫీ.. బ్యాక్ బిల్లింగ్ పై ఊరట
నేతన్నల నిరంతర ఉపాధి కోసం సర్కారు ఉపాయం
రాజన్నసిరిసిల్ల, 11 సెప్టెంబర్ 2025: ఉపాధికి భరోసా లేని రోజులన్నీ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను తీవ్ర భయాందోళనలో ముంచి వేసిన పరిస్థితులు. రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను "ప్రగతి " పథంలో నడిపేందుకు వేస్తున్న కొత్తదారులు ఇటీవల సాక్షాత్తు చేనేత జౌలి శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన మాట భరోసాతో నేతన్నల్లో ఆశలు చిగురుస్తున్నాయి. ఇటీవల సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని పరిణామాలపై "జన విజన్"ప్రత్యేక కథనం..
టెక్స్ టైల్ రంగంలోని దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్లకు ప్రత్యేక స్థానం ఉంది. అత్యధిక మరమగ్గాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాలతో అనేక మంది కార్మికులకు ఉపాధికి కేంద్రంగా ఉంది. మరమగ్గాల తో పాలిస్టర్, కాటన్ తో పాటు సైజింగ్ డైయింగ్ అనుబంధ పరిశ్రమలతో పలువురు ఉపాధి పొందుతున్న విషయం తెలిసిందే.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనేక గండాలను దాటుకుంటూ వస్తుందనే చెప్పాలి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలు కొన్నాళ్లు 40 వేల పై చిలుకు మరమగ్గాలతో కలకల్లాడిన సిరిసిల్ల ప్రస్తుతానికి సుమారు 25వేల మరమగ్గాల స్థాయికి పడిపోయింది. డైయింగ్, సైజింగ్ పరిశ్రమలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చేయూత ఇవ్వాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం అందించిన "బతుకమ్మ చీరల ఆర్డర్ " కొంత మేరకు కార్మికులకు ఉపాధి దొరికినా పూర్తిస్థాయిలో పరిశ్రమకు భద్రత అందించలేక పోయింది.
ప్రభుత్వం మారిన క్రమంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో అన్ని రంగాల పరిస్థితి రోజురోజుకు సంక్షోభాల దెబ్బతో ఉనికిని కాపాడుకోలేని దశకు చేరుకున్నాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా తమ వైపు ఆలోచించడం లేదన్న ఆందోళన పరిశ్రమను కొంతకాలం వెంటాడింది. అనూహ్యంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కే.కే. మహేందర్ రెడ్డిలు సిరిసిల్ల నేతన్నల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వానికి నివేదిస్తూ రావడం రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై దృష్టి సారించడంతో, పరిశ్రమకు జవ సత్వాలు అందించేందుకు ప్రయత్నించడం పట్ల సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతుంది.
కొత్త చూపుతో..
రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభాలకు తావు లేకుండా చేయాలన్న ఉద్దేశం కాగా ప్రధానంగా పరిశ్రమలో ఉన్న మధ్యతరగతి, దిగువ తరగతి శ్రేణులు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మార్పుకు శ్రీకారం చుట్టింది. రానున్న రోజుల్లో ఫలితాలు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రగతి వైపు నడిచేందుకు దోహదం చేస్తాయన్న నమ్మకం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని అన్ని వర్గాల్లో కనిపిస్తుంది. గతంలో రాష్ట్రంలోని పాలకులు పెట్టి పోయిన బతుకమ్మ చీరల బకాయి బిల్లులు సుమారు వెయ్యి కోట్ల రూపాయలను దశలవారీగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్లు చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిరిసిల్లలో పర్యటించిన సందర్భంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే.
నూలు బ్యాంక్ ఏర్పాటుతో చిగురించిన ఆశలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సహకార సంఘాల సభ్యులకు ప్రత్యేకంగా నూలు అందించేందుకు 50 కోట్లతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని హనుమాజీపేట లో ప్రత్యేకంగా నూలు బ్యాంకు ఏర్పాటు చేసింది. ప్రధానంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలొ మూడంచెల వ్యవస్థలో పై మెట్టులో యజమానులు, రెండవ మెట్టులో ఆసాములు (యజమానులపై ఆధారపడ్డ చిరు వ్యాపారులు) చివరి మెట్టు లో కార్మికులు ఉంటారు. మొత్తంగా వ్యవస్థ కొంతమంది పెట్టుబడిదారుల చేతుల్లో ఉండిపోవడాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం "నూలు బ్యాంకు" ఏర్పాటు ద్వారా ప్రభుత్వ ఆర్డర్లను ఇవ్వడమే కాకుండా నూలు బ్యాంకు ద్వారా మరమగ్గాల సహకార సంఘాలకు నూలు అందుబాటులో ఉంచడం ద్వారా భవిష్యత్ రీత్యా పరిశ్రమలో పెనుమార్పులు వచ్చేందుకు దోహదం చేయనున్నాయి. ఈ పరిణామాలతో సిరిసిల్ల నేతన్నల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
"బ్యాక్ బిల్లింగ్" పై ఇచ్చిన మాట భవిష్యత్తుపై భరోసా..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు గతంలో ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలోని పరిశ్రమకు అవసరమైన విద్యుత్తు 50% సబ్సిడీతో ప్రభుత్వాలు కొనసాగిస్తూ వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేసిన కొన్ని మార్పులు పరిశ్రమకు శాపంగా మారాయని కొందరు వస్త్ర పారిశ్రామికులు తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల, పరిశ్రమకు సంబంధించిన విద్యుత్ మీటర్ల విషయంలో కేటగిరి మార్పు చేయడం వల్ల అడ్డగోలుగా విద్యుత్ చార్జీలు పరిశ్రమలోని అనేకమందికి భారంగా మారాయి. అప్పటినుండి ఇప్పటిదాకా విద్యుత్ భారం విషయంలో ప్రభుత్వాలకు నేతన్నలు మొరపెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. కొంత సమయం వెసులుబాటు కల్పించినా బిల్లులభారం మాత్రం అలాగే పేరుకుంటూ పోతూ వస్తుంది. ఇప్పటికే సుమారు 30 కోట్లకు పైగా "బ్యాక్ బిల్లింగ్"భారం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను వెంటాడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చించి మాఫీ చేసేలా చూస్తామని సాక్షాత్తు చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇవ్వడం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ భవిష్యత్తుకు భరోసా ఇచ్చినట్లయింది.
"రుణమాఫీ" విషయంలో..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో రైతు రుణమాఫీ మాదిరిగానే నేతన్నలకు రుణమాఫీ చేస్తామంటూ ఇటీవల సిరిసిల్ల పర్యటనలో మంత్రి హామీ ఇవ్వడం వస్త్ర పరిశ్రమలోని అన్ని వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అన్ని రంగాల కార్మికులకు సంబంధించి ఈ మేరకు బ్యాంకులలో రుణాలు ఏ మేరకు ఉన్నాయో లెక్కలు తీయాలంటూ, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వంతో చర్చిస్తానంటూ మంత్రి హామీ తో నేతన్నల్లో మరింత భరోసాను అందించినట్టయ్యింది.
థ్రిఫ్ట్ పథకంలో వెలుసుబాటు...
ప్రధానంగా మూడు సంవత్సరాల పరిమితి గల థ్రిప్ట్ స్కీములో సిరిసిల్ల నేత కార్మికుల కోసం ప్రత్యేకంగా రెండు సంవత్సరాలు కాల పరిమితిలోనే పూర్తయ్యేలా త్వరలో పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్ ప్రకటించడం ప్రధానంగా వస్త్ర పరిశ్రమలో కింది మెట్టులో ఉన్న నేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
ఇక సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నిరంతరం వెంటాడుతున్న ఉపాధి పట్ల నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా అందించింది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్త్రాన్ని సిరిసిల్ల నేత కార్మికుల నుంచి తయారు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సిరిసిల్ల పర్యటనలో మంత్రి తెలియజేశారు. ఇకనుండి అన్ని ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్త్రాన్ని అధికారికంగా అందించి కార్మికులకు ఉపాధి పట్ల గ్యారంటీ కల్పించనున్నట్లు మంత్రి తెల్పడం ఆ దిశగా ఇప్పటికే పనులు ప్రారంభం కావడం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రగతి వైపు అడుగులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త దారులు వేసిందనే ఆశాభావం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని అన్ని వర్గాల్లో వ్యక్తం అవుతుంది.