పేదవారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఈ రేషన్ కార్డు: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

పేదవారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఈ రేషన్ కార్డు: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

ఎల్లారెడ్దిపేట మండలంలోని లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

-------------------------------
ఎల్లారెడ్దిపేట, ఆగస్టు - 10
-------------------------------

రేషన్ కార్డు అనేది ప్రతి పేదవారికి ఆత్మ గౌరవానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఎల్లారెడ్దిపేట మండల కేంద్రం లోని మణికంఠ గార్డెన్స్ లో నూతన రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఎల్లారెడ్దిపేట మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ వెల్లడించారు.వీటి ద్వారా పేదలకు ప్రతి నెల రేషన్ అందుతుందన్నారు. మండలంలో నూతనంగా 1494 కొత్త కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 2999 మంది కుటుంబ సభ్యుల పేర్లను అదనంగా నమోదు చేసి అందిస్తున్నామని ఇప్పటి వరకు మొత్తం 20838 రేషన్ కార్డులు ఉన్నాయని వెల్లడించారు. 

ప్రజల జీవనంలో రేషన్ కార్డు చాలా ముఖ్యమైన కీలక డాక్యుమెంట్ , ఆధార్ కార్డు, కరెంట్ కనెక్షన్ , ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. 

ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. నూతన రేషన్ కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, ఫించన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డిఓ వెంకటేశ్వర్లు, ఎల్లారెడ్దిపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సవేరా బేగం, డెప్యూటీ తహసిల్దార్ , స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post