ఒక అబద్దం వల్ల ఆ అబద్దం అమలులోకి రావడమే కాదు, నిజం వెలుగులోకి రాకుండా దాచే కుట్రా దాగి వుంటుంది. జరుగుతుంది. ఇదిగో ఇలాంటి ఒక స్పూర్తివంతమైన, ఆదర్శప్రాయమైన ఒక ధీరచిత్తుడి జీవన పోరాటాన్ని దాచడం కోసం రకరకాల కుట్రలు పన్ని అత్యధిక డిగ్రీలు కలిగిన దళిత వ్యక్తిని మరిపించే కుట్ర జరుగుతుందని మేధావులు ఆరోపిస్తున్నారు.
మొత్తం 121 డిగ్రీలు సాధించిన ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే అతని ఘనతని మరిపించడానికి రకరకాల వ్యక్తుల కథలను ప్రచారంలోకి తీసుకువచ్చిన నేపధ్యంలో అసలైన రికార్డుల వీరుడి పరిచయం..
పొలాల్లో పశువుల కాపరిగా, వ్యవసాయ కూలీగా, హోటల్లో కప్పులు కడిగిన బాల్యంతో మొదలైన జీవితం ఈ దేశంలో అత్యధిక డిగ్రీలు కలిగిన వ్యక్తిగా రికార్డుకెక్కడమంటే ఒక మనిషి ఎంతగా పట్టుదల వూహించుకోవచ్చు. దేశంలోని అత్యున్నతమైన సివిల్ సర్వీసులకి ఎలా ఎంపికయ్యడో తెలిస్తే మనం అదొక అందగా అల్లిన కథ అనుకుంటాం. ఒక మారుమూల దళిత కుటుంబంలో కడుపేదరికంలో పుట్టినవ్యక్తి రాష్ట్రపదవికి పోటీ చేయడమంటే, అతని ఎదుగుదలకి వూహనే హద్దు చేసుకోవాలి. ఆ వ్యక్తిపేరు పి.జె. సుధాకర్, వారం క్రితం 68ఏళ్ల వయసులో చనిపోయారు.
పట్నాల.జాన్.సుధాకర్ విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి మండలం పెదగాడి కుగ్రామంలో నిరుపేద దళిత కూలీ ఇంట జన్మించాడు. పేదరికంతో చదువు మానేశాడు. కూలీగా, పశువులు కాపరిగా, హోటల్లో సర్వరుగా పనిచేశాడు, అయితే చదువుమీదున్న మమకారంతో ప్రైవేటుగా చదువుకుని 20సం. వయస్సులో సీబీఐలో ఒక జూనియర్ అసిస్టేంటుగా ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుండి ఆయన కరస్పాండెన్స్ కోర్సులు మరియు ఓపెన్ విశ్వవిద్యాలయాల ద్వారా పది డిగ్రీలు వెనకేస్తూ పోయాడు. సీబీఐలో అత్యంత తక్కువ ఉద్యోగమైన అటెండరు తర్వాతి ఉద్యోగంలో చేరిన అతడు 1987 లో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐ.ఐ.ఎస్) కోసం ఎంపికయ్యారు.
పి.జె.సుధాకర్ ఒక పక్క ఉన్నత ఉద్యోగంలో వుంటూనే చదువు, విఙ్ఞానం పట్ల ఎడతెగని మమకారంతోనో, తన జాతికి దూరమైన చదువుపట్ల ప్రతీకారంతోనో గానీ మొత్తం 121 డిగ్రీలను సాధించి సరికొత్త రికార్డు సాధించాడు. ప్రజా సంబంధాలు, సామాజిక సేవ, నేర శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చట్టం, రాజకీయ శాస్త్రం, చరిత్ర, అంతర్జాతీయ సంబంధాలు, మానవ హక్కుల చట్టం మరియు వైద్య చట్టాలు వంటి అంశాలతో పాటు అనేక ఇతర రంగాలలో 121 డిగ్రీలను సాధించాడు. ఈ డిగ్రీలలో కేవలం ఇంజినీరింగ్ సబ్జెక్టు మాత్రమే మినహాయింపు దొరికింది. చదవడమే ధ్యేయంగా పెట్టుకున్న ఆయన వివాహమూ మర్చిపోయాడు.
ఆయన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సి.బి.ఐ), ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పి.ఐ.బి), ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, పబ్లికేషన్స్ డివిజన్ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ వంటి అనేక సంస్థలలో నిరుపమాన సేవలు అందించారు. ఆయన అనేక భారతీయ విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. యోజన పత్రికకి ఎడిటర్‌గా పనిచేశారు. మహాశ్వేతాదేవి వంటివారిని విస్తృతంగా వెలుగులోకి తెచ్చాడు.
డాక్టర్ పి.జె. సుధాకర్ 2009 లో రాజా రామ్ మోహన్ రాయ్ మిషన్ నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఆయన 2010 లో హైదరాబాద్‌లోని చైతన్య ఆర్ట్ థియేటర్స్ నుండి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును స్వీకరించారు. రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ్ పురస్కారం రావడానికి డాక్టర్ పి.జె. సుధాకర్ అనేక విధాలుగా కృషి చేసి విజయం సాధించాడు. భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేసే నిమిత్తం ఆయన 2012లో నామినేషన్ దాఖలు చేసి అథ్యధిక విద్యార్హతలున్న మేధావిగా గుర్తించబడినాడు.
గొప్ప సామాజిక సంస్కర్త. సామాజిక దురాచారాల నిర్మూలన కోసం కృషిచేశారు. పిల్లలు, మహిళలు, సమాజంలోని బలహీన వర్గాలైన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు మైనారిటీల సంక్షేమం కోసం ఆయన నిరవధికంగా కృషిచేశారు. గ్రామీణ అక్షరాస్యత కోసం తీవ్రంగా కృషి చేశారు. బాల కార్మికత్వాన్ని రూపుమాపడానికి కృషిచేశారు. యువత భవిత కోసం ప్రేరణాత్మక ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ రకంగా ఆయన సమాజంలోని వివిధ వర్గాల నుండి లక్షలాది మంది యువతను సామాజిక మార్పు కోసం కృషి చేశారు.
వంద మంది మనస్తత్వవేత్తల బృందంగా కార్యకలాపాలు నిర్వహించే జాతీయ మానసిక ఆరోగ్య ఉద్యమ వ్యవస్థాపక అధ్యక్షుడు గాను డాక్టర్ పి.జె. సుధాకర్ కృషిచేసి సమాజంలో నైతిక విలువలు మరియు నైతిక ప్రమాణాలను ప్రోత్సహించారు. ఆయా సామాజిక సమస్యలపై వర్క్‌షాప్‌లను ఆయన నిర్వహించారు. మానవ హక్కులను పరిరక్షిస్తూనే గొంతులేని వారి గొంతుకగా తన చివరి క్షణం వరకు ఆయన కృషి చేశారు.
బాలకార్మికుడిగా జీవితం మొదలుపెట్టి, అదీ చదువుకు బహిష్కృతమైన కులంలో పుట్టి , భారతదేశంలో అత్యధిక డిగ్రీలు సాధించిన విద్యావంతుడిగా రికార్డులు నెలకొల్పిన సుధాకర్ ఒక స్పూర్తి ప్రదాత. సిసలైన ప్రతీకార వీరుడు. అంబేద్కర్ చదువులకు వారసుడు.