విమానం నడపడం ఎలాగో చూపించిన పైలెట్.. ప్రయాణం పూర్తి కాగానే సస్పెండ్

విమానం నడపడం ఎలాగో చూపించిన పైలెట్.. ప్రయాణం పూర్తి కాగానే సస్పెండ్
బ్రిటిష్ ఎయిర్‌వేస్ పైలట్‌పై వేటు వేసిన సంస్థ

హీత్రూ-న్యూయార్క్ విమానంలో కాక్‌పిట్ డోర్ తెరిచి ఉంచడమే కారణం

విమానంలో ఉన్న కుటుంబానికి తన పనితనం చూపించేందుకే ఈ చర్య

ఉగ్రవాద నిరోధక చట్టాలను ఉల్లంఘించినట్లు తీవ్ర ఆరోపణలు

సిబ్బంది, ప్రయాణికుల ఆందోళనతో అమెరికాలో ఫిర్యాదు

పైలట్ సస్పెన్షన్‌తో తిరుగు ప్రయాణ విమానం రద్దు

విమానం నడుపుతున్న తనను చూసి కుటుంబ సభ్యులు మురిసిపోవాలనుకున్నాడో ఏమో గానీ, ఓ పైలట్ చేసిన పని అతడి ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. లండన్‌లోని హీత్రూ నుంచి న్యూయార్క్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణ సమయంలో కాక్‌పిట్ డోర్‌ను తెరిచే ఉంచి, ఉగ్రవాద నిరోధక చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురయ్యాడు.

ఇటీవల హీత్రూ-న్యూయార్క్ విమానంలో ఓ పైలట్ కాక్‌పిట్ డోర్‌ను మూయకుండానే విమానాన్ని నడిపాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న తన కుటుంబ సభ్యులకు, తాను విమానాన్ని ఎలా ఆపరేట్ చేస్తానో చూపించాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అయితే, విమానం గాల్లో ఉండగా కాక్‌పిట్ డోర్ తెరిచి ఉండటాన్ని గమనించిన ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక భయపడిపోయారు.

ఈ ఘటనపై తోటి సిబ్బంది తీవ్రంగా స్పందించారు. విమానం న్యూయార్క్‌లో ల్యాండ్ అయిన వెంటనే, అక్కడి అధికారులకు ఆ పైలట్‌పై ఫిర్యాదు చేశారు. 9/11 ఉగ్రదాడుల తర్వాత విమానయాన భద్రతా నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రయాణ సమయంలో కాక్‌పిట్ డోర్‌ను లాక్ చేసి ఉంచడం తప్పనిసరి. ఈ నిబంధనను పైలట్ ఉల్లంఘించడం తీవ్రమైన నేరంగా పరిగణించిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ యాజమాన్యం, అతడిని తక్షణమే సస్పెండ్ చేసింది.

"కాక్‌పిట్ డోర్ చాలా సేపు తెరిచే ఉంది. ఇది ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. తోటి సిబ్బంది కూడా కలవరపడి అమెరికాలో రిపోర్ట్ చేయడంతో, యాజమాన్యం అతడిని సస్పెండ్ చేయాల్సి వచ్చింది" అని సంబంధిత వర్గాలు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించాయి. పైలట్ సస్పెన్షన్ కారణంగా, ఈ నెల 8న న్యూయార్క్ నుంచి లండన్‌కు రావాల్సిన తిరుగు ప్రయాణ విమానాన్ని రద్దు చేశారు. ఆ విమానంలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.

Post a Comment

Previous Post Next Post