పెద్దూరులో మహిళా సంఘాలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం

పెద్దూరులో మహిళా సంఘాలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం
సిరిసిల్ల, 09 ఏప్రిల్ 2025: రైతులతో మమేకమై వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని మహిళా సంఘాలకు పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్. బుధవారం సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూరులో ఇందిరా మహిళా శక్తి పథకము ద్వారా మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలు నిర్వహించనున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకంలో భాగంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించిందని అన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు వసతులు కల్పించాలని సూచించారు. వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున కేంద్రాలలో నీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. అకాల వర్షాలు కురిసినట్లయితే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తాటిపత్రులు కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. విలీన గ్రామాల పరిధిలో నిర్వహిస్తున్న ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు నిర్వహణకు ఇచ్చినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చింది వచ్చినట్టుగా రోజువారి రికార్డు నిర్వహించాలని సూచించారు. ఎప్పటికప్పుడు తేమశాతాన్ని పరీక్షిస్తూ వరుస క్రమంలో కొనుగోలు పూర్తి చేయాలని అన్నారు. దళారులను ఆశ్రయించి మోసపోకుండా ప్రభుత్వం ప్రకటించిన రూ. 2,310 మద్దతు ధరను పొందాలని అన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డిఓ రాదాబాయి, సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు, పెద్దూర్ మాజీ సర్పంచ్ రాకం రమేష్, మున్సిపల్ అధికారి బేగ్, యూత్ కాంగ్రెస్ నాయకులు సలేంద్రి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post