వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది
బాలనగర్, చెక్కపల్లి, మల్లారం లో కొనుగోలు కేంద్రాల ప్రారంభం
హాజరైన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్
వేములవాడ/వేములవాడ రూరల్, ఏప్రిల్ 09 2025: రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సరైన మద్దతు ధరకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు
వేములవాడ పట్టణ పరిధిలో బాలనగర్, వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి, మల్లారం లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ,అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని వివరించారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా తల్లులను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం కొనుగులు కేంద్రాలను వారికి కేటాయించారని వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు పెద్ద పీట వేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు,మేలైన వంగడాలను ప్రభుత్వం తరుపున అందిస్తున్నామని తెలిపారు.
రైతులకు ఏక కాలంలో రైతు ప్రయోజనాలు కోసం 21 వేల కోట్ల మేర రుణమాఫీ చేయడం జరిగిందని వెల్లడించారు.
సన్న వడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్ కు అదనంగా రూ. 500 ఇస్తున్నదని తెలిపారు.
పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్, అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రైతులకు ఇబ్బంది లేకుండా అదనపు సెంటర్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంలో నష్టపోయిన రైతులకు రూ.10,000 పరిహారం చెల్లించామని గుర్తు చేశారు.
జిల్లాలో 248 సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా జిల్లా లో ఇప్పటి వరకు 35 సెంటర్లు ప్రారంభించామని తెలిపారు.
కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చూడాలని, సరిపడా టార్పలిన్ కవర్లు, గన్ని సంచులు,ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచాలని విప్ ఆదేశించారు. రైతులు పండించిన పంట చివరి గింజా వరకు కొంటామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి, జిల్లా మేనేజర్ రజిత,జిల్లా సహకార అధికారి రామకృష్ణ, మార్కెట్ కమిటీ, ఫ్యాక్స్ ఛైర్మెన్ లు రోండి రాజు, ఏనుగు తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, తదితరులు పాల్గొన్నారు.