బార్యభర్తల మధ్య వివాదాల పరిష్కారం కోసం ఫ్యామిలీ కౌన్సిలింగ్
సిరిసిల్ల 9 ఏప్రిల్ 2025: ప్రభుత్వ సాధారణ వైద్యశాలలోని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నెహ్రూనగర్ లోని కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ మనోవికాస సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పున్నంచందర్ మాట్లాడుతూ.. భార్యాభర్తల మధ్య వివాదాల పరిష్కారం కోసం మైండ్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రతి రోజు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
చిన్న చిన్న మనస్పర్థలే భార్యాభర్తల మధ్య వివాదాలకు కారణమని అన్నారు. ఒకరిపై ఒకరికి గల అపనమ్మకం మూలంగానే వివాదాలు పెద్దగా మారుతున్నాయని తెలిపారు. తద్వారా నిత్యం కలహాల కాపురాలుగా, మనశ్శాంతి కరువై అనేక దురలవాట్లకు కారణం అవుతున్నాయని అన్నారు.
సానుకూల దృక్పథంతో ఒకరినొకరు అర్థం చేసుకుంటే వివాదాలకు తావే ఉండదని తెలిపారు.
నేటి ఆధునిక యుగంలో అనేక ఆర్థిక, సామాజిక పరమైన ఒత్తిళ్లు వ్యక్తుల మధ్య అవగాహన రాహిత్యానికి కారణమై అన్యోన్యతలు, ప్రేమాను బంధాలకు దూరం చేస్తున్నాయని తెలిపారు.
తీవ్ర మానసిక ఒత్తిడిలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని విడాకుల వరకు వెళుతున్నారని అన్నారు.
నేడు వ్యక్తుల్లో ఇగో సెంట్రిజం ఎక్కువై అనేక అపార్థాలకు కలతలు, కారణమవుతున్నదని అన్నారు.
అహం వీడి ఒకరినొకరు అర్థం చేసుకొంటే ఎలాంటి మనస్పర్థలు రావని తెలిపారు.
ప్రతిరోజూ మైండ్ కేర్ సెంటర్ ద్వారా కార్మికులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలుపుతూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్మికులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది కొండ ఉమ, వేముల అన్నపూర్ణ, రాపెల్లి లత, బూర శ్రీమతి, కిమ్స్ కళాశాల విద్యార్థులు జి.పద్మ , జి.పూజిత, వి. సుస్మిత, నాగుల వందన, జె. అనుపమ అంజనీ, డి. మానస మరియు కార్మికులు పాల్గొన్నారు.