రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తుల ఆహ్వానం
ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాల యాల్లో అందుబాటులో దరఖాస్తు ఫారాలు
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఆయా శాఖల అధికారులకు శిక్షణ
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ -01: జిల్లాలోని అర్హులైన వారి నుంచి రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ద్, జైన్, పార్శి)లకు చెందిన నిరుద్యోగ యువత, ఇతరులకు ఉపాధి అవకాశాలు ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించిందని తెలిపారు.
ఈ మేరకు రాజీవ్ యువ వికాసంపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, బ్యాంకర్లతో మంగళవారం అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని
నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజీవ్ యువ వికాసం పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యువతకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో దాదాపు రూ.పదివేల కోట్లతో పథకానికి రూపకల్పన చేసిందని వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన వారందరూ తమ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వాటి కావాల్సిన పత్రాలు జత చేసి అందజేయాలని సూచించారు. తహసీల్దార్లు కులం, ఆదాయం సర్టిఫికెట్ల పంపిణీ పై ప్రత్యేక దృష్టి సారించి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయాలు మున్సిపల్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని తెలిపారు. గడువులోగా వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి మండల్ లెవెల్ కమిటీకి పంపిస్తారని వివరించారు. ఆ కమిటీ పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత జిల్లా కమిటీకి పంపిస్తారని వెల్లడించారు. అనంతరం అర్హులు ఎంపిక చేసుకున్న రుణాలకు సంబంధించిన శిక్షణను అందజేస్తారని తెలిపారు.
అభ్యర్థులు, పూరించిన దరఖాస్తు ఫారమ్‌ను హార్డ్ కాపీ, అవసరమైన పత్రాలను జత పరిచి మండల ప్రజాపాలన సేవా కేంద్రం (గ్రామీణ ప్రాంతాలలో MPDO కార్యాలయం) లేదా మున్సిపల్ కమిషనర్ (పట్టణ ప్రాంతాలు)లో సమర్పించాలని స్పష్టం చేశారు.
అవసరమైన పత్రాలు ఇవే..
• ఆధార్ కార్డు.
• రేషన్ కార్డు
* ఆదాయ ధృవీకరణ పత్రం.
• కుల ధృవీకరణ పత్రం (తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జారీ చేయబడినది).
• శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా రంగ పథకాలకు).
• పట్టాదార్ పాస్ బుక్ (వ్యవసాయ పథకాలకు).
• సదరం సర్టిఫికేట్ (PWDల కోసం).
• పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
• దుర్బల (బలహీన) సమూహ ధృవీకరణ పత్రం (మండల స్థాయి కమిటీ ధృవీకరించబడినది).
ఆదాయ పరిమితి
• గ్రామీణ ప్రాంతాలు: సంవత్సరానికి రూ.1,50,000/-.
• పట్టణ ప్రాంతాలు: సంవత్సరానికి రూ.2,00,000/- (మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు).
• రేషన్ కార్డు వివరాలను దరఖాస్తు ఫారంలో ఇవ్వాలి మరియు రేషన్ కార్డు అందుబాటులో లేని సందర్భాలలో మాత్రమే, అభ్యర్థులు “మీ-సేవ” జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.
వయోపరిమితి:
• వ్యవసాయేతర పథకాలకు 21 - 55 సంవత్సరాలు (2024 సంవత్సరం జూలై 1 నాటికి)
• వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 21 - 60 సంవత్సరాలు (2024 సంవత్సరం
జూలై 1 నాటికి)
నిధుల కేటాయింపు, యూనిట్ ధర, సబ్సిడీ,బ్యాంకు లోన్
ఇదీ రాయితీ
1) యూనిట్ ధర Rs.50,000/- వరకు
100% రాయితీ
2) యూనిట్ ధర Rs.50,001 నుండి Rs.1,00,000/- వరకు
90%, రాయితీ 10% బ్యాంక్ రుణం
3) యూనిట్ ధర Rs.1,00,001 నుండి Rs.2,00,000/- వరకు 80% రాయితీ 20% బ్యాంక్ రుణం
4) యూనిట్ ధర Rs.2,00,001 నుండి Rs.4,00,000/- వరకు 70% రాయితీ 30% బ్యాంక్ రుణం
5) దుర్బల (బలహీన) సమూహం
(Rs.1,00,000/- వరకు)
100% (90% with 10% from EMF)
6) చిన్న నీటిపారుదల (Minor Irrigation)
100% రాయితీ
మిగతా వివరాలకు జిల్లా బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయ్, డీఆర్డీఓ శేషాద్రి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags
Rajiv Yuva Vikasam