తెలంగాణలోనే రికార్డ్.. సిరిసిల్లలో అధిక సంఖ్యలో రంగవల్లికలు


తెలంగాణలోనే రికార్డ్.. సిరిసిల్లలో అధిక సంఖ్యలో రంగవల్లికలు


తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అత్యధిక రంగవల్లికలను రూపొందించిన కార్యక్రమం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించారు. టీం 39 ఆధ్వర్యంలో ఎస్సార్ ఇంటర్నెట్ అధినేత, సామాజిక సేవకులు పాసికంటి లవన్ కుమార్, మిత్ర బృందం ఏర్పాటు చేసిన రంగవల్లికల పోటీలలో సిరిసిల్ల పట్టణంలోని కార్మిక క్షేత్రమైన బివై నగర్ మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలంతా తమ గృహాలను అందంగా అలంకరించుకునే నేపథ్యంతో రంగవల్లికల పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు లవన్ కుమార్ తెలిపారు. బి వై నగర్ లోని 31 వ వార్డు పరిధిలో గల ఏడు రోడ్ల వరుసలలో మహిళలు తమ ఇళ్ల ఎదుట గీసిన పరిధిలో అందంగా ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. సుమారు 1000 మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీలలో 358 ముగ్గులు వేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. న్యాయ నిర్ణేతలుగా మహిళా డాక్టర్లు పులి ప్రియాంక, డా.స్నేహ, డా. ఆకాంక్ష వ్యవహరించారు. ముగ్గుల అలంకరణ మధ్యాహ్నం వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి వార్డులోని ప్రధాన కూడలిలో స్టేజి ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులచే పాటలు, నృత్యాలు ప్రదర్శించారు. అనంతరం మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రముఖుల గొంతులను అనుకరిస్తూ స్థానికులను అలరించారు. కార్యక్రమానికి మీడియా పార్ట్నర్ గా జనవిజన్ కేబుల్ టీవీ ఛానల్ వ్యవహరించారు. ముగ్గులు వేసి వాటిని రంగులతో అలంకరించడంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన మహిళలు పది మందికి మొదటి బహుమతిగా 10 డ్రెస్సింగ్ టేబుల్లు, రెండో బహుమతి గెలుచుకున్న పదిమంది మహిళలకు 10 మిక్సర్ గ్రైండర్లు విశాల షాపింగ్ మాల్ సహకారంతో, ప్రత్యేక విభాగంలో పరిగణలోకి తీసుకున్న 18 మంది మహిళలకు ఐదు లీటర్ల ప్రెషర్ కుక్కర్ లను లవన్ కుమార్ తో పాటు విశాల షాపింగ్ మాల్ సంయుక్తంగా సమర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న 358 మంది మహిళలకు ప్రతి ఒక్కరికి ఆడెపు మురళి చిట్ ఫండ్ వారి సహకారంతో నిర్వాహకులు లవన్ కుమార్ తో పాటు టీం 39 సభ్యులు స్టీల్ పాత్రలను అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకు పది శాతం డిస్కౌంట్ తో కూడిన గిఫ్ట్ కూపన్ ను విశాల షాపింగ్ మాల్ సహకారంతో అందించారు.

Post a Comment

Previous Post Next Post