వాషింగ్టన్, 25 జూన్ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే మంగళవారం ఉదయం జైలు నుండి విడుదలయ్యారు. అమెరికా న్యాయశాఖతో జరిగిన ఒప్పందంలో భాగంగా ఆయన నేరాన్ని అంగీకరించనున్నట్లు సమాచారం. ఈ వారం పశ్చిమ ఫసిపిక్‌లోని యుఎస్ కామన్వెల్త్ ప్రాంతమైన మరియానా ద్వీపంలో అమెరికా ఫెడరల్ కోర్టు విచారణకు హాజరుకానున్నారు. గూఢచర్యం చట్టం కింద అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని చట్ట వ్యతిరేకంగా పొందడం, ప్రచురించారన్న నేరాన్ని అసాంజే అంగీకరించనున్నట్లు యుఎస్ న్యాయ శాఖ ఓ లేఖలో ఫీల్డ్ కోర్టుకు తెలిపింది.
అయితే నేరారోపణ అభ్యర్థనను న్యాయమూర్తి తప్పనిసరిగా ఆమోదించాల్సి వుంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న రహస్యపత్రాల ప్రచురణ కేసు కొలిక్కి రానుంది. అమెరికా సైన్యంలోని లోపాలను వెల్లడించేందుకు ఆయన ఓ జర్నలిస్టులా వ్యవహరించారంటూ అసాంజేకు పత్రికా స్వేచ్ఛ కోరుకునే పలువురు న్యాయవాదులు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.
మరియానా దీవులలో సైపాన్‌లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం విచారణకు హాజరుకానున్నారు. అనంతరం ఆస్ట్రేలియాకు తిరిగి వస్తాడని భావిస్తున్నారు. అమెరికాకు రావడానికి ఆయన నిరాకరించడంతో, అక్కడ విచారణ చేపడుతున్నట్లు సమాచారం. అమెరికా ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతం ఆస్ట్రేలియా సమీపంలో ఉంటుంది.
అసాంజే బ్రిటీష్ జైలు నుండి విమానంలో యుకెకి వెళతారని వికీలీక్స్ ప్రకటించింది. మాకు అండగానిలిచిన, మనకోసం పోరాడిన అసాంజే విడుదల కోసం జరిపిన పోరాటంలో కట్టుబడి ఉన్న వారికి కృతజ్ఞతలు అని అన్నారు. ప్రభుత్వ అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనల సంచలన కథనాలను వికీలీక్స్ ప్రచురించింది. వారి చర్యలకు బలమైన జవాబుదారీగా ఉంది. అసాంజే ఈ సూత్రాల కోసం, ప్రజల హక్కులు తెలుసుకునేందుకు తీవ్రంగా యత్నించారని పేర్కొంది.