కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలి
కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్
తంగల్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి, నేరెళ్లలోని కొనుగోలు కేంద్రాల పరిశీలన
సిరిసిల్ల, మే 8 : ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. తంగల్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి, నేరెళ్లలోని కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ బుధవారం పరిశీలించారు. ముందుగా కొనుగోలు కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అంకిరెడ్డిపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించి డబ్బులు పొందిన రైతుతో కొనుగోలు కేంద్రం నిర్వాహకుడి ద్వారా కమిషనర్ ఫోన్ చేయించి స్వయంగా మాట్లాడారు. డబ్బులు ఎన్ని రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో పడ్డాయని, ఏమైనా ఇబ్బందులు ఎదురు అయ్యాయా అడిగి తెలుసుకోగా, ఎలాంటి ఇబ్బందులు కాలేదని సదరు రైతు కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళారు. అనంతరం ధాన్యం సేకరణ రిజిస్టర్లు పరిశీలించి కమిషనర్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులు తమ ధాన్యం కింద, దానిపైన టార్పాలిన్ పెట్టాలని సూచించారు కొనుగోలు చేసిన ధాన్యం వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని, లారీల సంఖ్య పెంచాలని, ఈ మేరకు ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ట్యాబ్ ఎంట్రీ చేయాలని, రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వెంట వెంటనే పడేలా చూడాలని కమిషనర్ పేర్కొన్నారు. ఇక్కడ అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జితేంద్ర ప్రసాద్, డీఆర్డీఓ శేషాద్రి, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, ఏపీఓ పాపారావు తదితరులు పాల్గొన్నారు.