ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు మరో అవకాశం

జోగులంబ గద్వాల, 19 ఎప్రిల్: ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్‌ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం లబ్ధిదారుల్లో 70 శాతం మాత్రమే ఇప్పటి వరకు నమోదు చేసుకున్నారు. మిగిలిన వారి కోసం మరో అవకాశం ఉండకపోవచ్చని, త్వరగా పూర్తి చేసుకోవాలని సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,13,855 రేషన్‌ కార్డులు ఉండగా, 6,85,910 మంది రేషన్‌ లబ్ధిదారులున్నారు. ఇంకా వివిధ కారణాల వల్ల 2,05,084 మంది ఈ-కేవైసీ చేయించుకోలేదని అధికారవర్గాలు తెలుపుతున్నాయి.

అర్హులకే సంక్షేమ పథకాలు..

 సంక్షేమ పథకాలు అర్హులకే అందించడానికి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రేషన్‌ కార్డులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. దీనికోసం శాఖపరంగా అవగాహన కార్యక్రమాలు సైతం చేపట్టింది. ఈ విషయమై తమకు అందుబాటులో ఉన్న రేషన్‌ దుకాణాలకు వెళ్లి ఈ-కేవైసీ చేసుకోవాలని పౌరసఫరాల అధికారులు సూచించారు. పలు దఫాలుగా అవకాశం ఇచ్చినా ఇంకా మిగిలిపోయిన కారణంగా ఎక్కువ మందికి నష్టం కలిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం రేషన్‌ దుకాణాల్లో నమోదు చేసుకోవడానికి మరోమారు అవకాశం కల్పించింది.


ప్రధాన సమస్యలివే..

వేలిముద్రలు పడక, సాంకేతిక సమస్యలతో కొంతమేర జాప్యం జరుగుతోంది. దీనికితోడు చిన్నారుల ఆధార్‌ నవీకరణ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలువురు వృద్ధుల వేలిముద్రలు పడటం లేదు. మీసేవా, ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి నవీకరణ పూర్తి చేసుకున్నా.. ఈ-కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడం లేదు. వలస వెళ్లిన వారి కోసం అక్కడ ఉండే రేషన్‌ షాపుల్లో ఈ-కేవైసీ చేసుకునే వెసులుబాటు ఉన్నా కొందరు డీలర్లు తమ పరిధిలోని వారికే చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ-కేవైసీ అవశ్యకత విషయమై రేషన్‌ డీలర్లకు, లబ్ధిదారులకు అధికారులు పలు సూచనలు చేస్తూనే ఉన్నారు. అవకాశం ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే రేషన్‌ దుకాణాలకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకుంటే ప్రయోజనం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post