అమరావతి: బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయం- థాయ్‌లాండ్ దక్షిణ ప్రాంతం గగనతలంపై ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం వచ్చే 29వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
క్రమంగా ఇది- తుఫాన్‌గా మారడానికి అనుకూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి పేర్కొంది.
డిసెంబర్ 1వ తేదీ నాటికి తుఫాన్‌గా ఆవిర్భవిస్తుందని ఐఎండీ అంచనా వేసింది. క్రమంగా అండమాన్ నికోబార్ ద్వీపానికి పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతుందని, డిసెంబర్ 4 లేదా 5 తేదీల్లో ఏపీ తీరానికి సమీపిస్తుందని వివరించింది. దీని ప్రభావం ఈ నెల 1వ తేదీ నుంచి ఏపీ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ తుఫాన్‌కు మిఛౌంగ్ (Cyclone Michaung) అని పేరు పెట్టారు. మయన్మార్ ఈ పేరును సూచించింది. ఈ ఏడాదిలో బంగాళాఖాతంలో ఏర్పడబోయే నాలుగో తుఫాన్ ఇదే అవుతుంది. హిందూ మహా సముద్రంలో ఇప్పటివరకు ఆరు తుఫాన్లు ఏర్పడ్డాయి.
ఈ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే అండమాన్ నికోబార్‌లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. వర్ష తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది కూడా. మరో 48 గంటల పాటు వర్షాలు పడొచ్చని తెలిపింది. చేపలవేటకు వెళ్లకూడదని మత్స్యకారులను హెచ్చరించింది.
ఇదివరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురుగా వర్షాలు పడ్డాయి. ఏపీలోని పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చెదురుమదురుగా వర్షం కురిసింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ సహా తెలంగాణ ఉత్తర ప్రాంతంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి.