దిల్లీ: చైనా (China)లో గత కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు (Respiratory Infections).. ప్రపంచ దేశాలను మళ్లీ కలవరపాటుకు గురిచేస్తున్నాయి..
భారత (India) ప్రభుత్వం ఇటీవల దీనిపై స్పందిస్తూ.. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హరియాణా, తమిళనాడు రాష్ట్రాలు తమ ఆరోగ్య వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. శ్వాసకోశ సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆసుపత్రులు, ఆరోగ్య సిబ్బందిని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశించాయి..
చైనాలో గత కొన్ని రోజులుగా నిమోనియా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. అయితే, అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలే అని, ఈ కేసుల్లో కొత్త వైరస్‌లను గుర్తించలేదని చైనా చెబుతోంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఇటీవల రాష్ట్రాలకు లేఖ రాసింది. ప్రజారోగ్య సంరక్షణ, ఆస్పత్రుల సంసిద్ధతపై తక్షణమే సమీక్ష జరపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. మానవ వనరులు, ఆస్పత్రి పడకలు, అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్, యాంటీబాడీలు, పీపీఈ, టెస్టు కిట్ల వంటివి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపింది.