నా మాటలు వక్రీకరించారు దుష్ప్రచారం సరికాదు : ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్


తనకు, ప్రభుత్వానికి మధ్య అగాధం సృష్టించడానికి ఓ పత్రిక ప్రయత్నించటం చాలా బాధాకరమని, తన మాటలు వక్రీకరించారని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని 4వ అంతస్తులో ఎస్సీ కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ తాను ఈ నెల 2న మాకినేని సుందరయ్య భవన్ లో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఇంప్లిమెంటేషన్ స్టేటస్ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా వెళ్లటం జరిగిందన్నారు. అక్కడ ఎస్సీలు అందరూ తమ బాధలు చెప్తుంటే, ఎస్సీ కులంలో పుట్టిన నేను కూడా పెద్ద బాధితుడినే అనడం అందరికీ తెలిసిందే అన్నారు. దానిని ఒక పత్రిక ఈ ప్రభుత్వంలో నేను పెద్ద బాధితుడిని అని వక్రీకరించేలా రాయడం సరికాదన్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ప్రభుత్వానికి దూరం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అన్న మాటలను ప్రభుత్వానికి లింక్ పెట్టి బురద జల్లటం పెద్ద ఘోరమన్నారు. ప్రభుత్వంపై ఏమైనా ట్రోల్ చేయాలంటే చేయవచ్చు కానీ తనను కూడా కలిపి చేయటం చాలా బాధపెట్టిందన్నారు. ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా తాను మాట్లాడింది ఏమిటీ,  మీరు వ్రాసింది ఏమిటి అని విలేఖరులను ప్రశ్నించారు. వేలాది సంవత్సరాలుగా ఎస్సీలది బాధిత కులమే అన్నారు. అందులో భాగంగా ఎస్సీ సోదరులు బాధితులమని అంటే తాను సైతం పెద్ద బాధితుడినే అనడంలో తప్పేముందని నిలదీశారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్-19 ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేవి రెండూ ఒకే ఆర్టికల్ ద్వారా మనకు లభించాయని తెలిపారు. కానీ  స్వేచ్ఛను ఇలా దుర్వినియోగం చేయటం న్యాయమేనా అని ప్రశ్నించారు. ఇలా అయితే ప్రజలకు ఎలా సందేశం ఇవ్వాలి అని విక్టర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఈ 26 నెలల్లో 5 సార్లు పర్యటించానని చెబుతూ..  మరి అప్పుడు ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా తాను సెన్సెషనల్ ఇష్యూస్ తీసుకున్నా అవి ఎందుకు రాయలేదని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్  ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్లండి తమ జాతి ప్రజలకు ఎలా అండగా ఉంటున్నానో చెబుతారన్నారు. అహోరాత్రులు వారి అభ్యున్నతి, సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేసిన విషయం ఎవరిని అడిగినా చెప్తారన్నారు. గౌరవ ముఖ్యమంత్రి. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి, తనకు మధ్య దూరం పెంచాలని, ప్రభుత్వానికి దూరం పెట్టాలని చూడటం హేయమన్నారు. ఈ సందర్భంగా ఫోర్త్ ఎస్టేట్ బాధ్యతలను గుర్తుచేశారు. అత్యున్నత పదవిలో ఉన్న తన మీదనే ఇలా రాస్తే ఇక సామాన్యుని పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.  తనకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదని, కేవలం అంబేద్కర్, బుద్దుడి భావజాలంతో పనిచేస్తున్న తనను ముఖ్యమంత్రి గుర్తించి ఎస్సీలకు న్యాయం జరగాలంటే ఇతను కరెక్ట్ అని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా అత్యున్నత పదవిని ఇవ్వటం జరిగిందని విక్టర్ ప్రసాద్ వివరించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తనను ఎప్పుడూ గౌరవంగా చూస్తారని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ తెలిపారు. వాస్తవం ఇలా ఉంటే ఈ ప్రభుత్వంలో తాను పెద్ద బాధితుడిని అని ట్రోల్ చేయటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. తాను ఈ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నానని, తన మీద లేనిపోని అభాండాలు వేయటం మనస్సును కలిచివేసిందన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డితోనే ప్రయాణమని  ఘంటాపథంగా చెప్పారు. పదవి ఉన్నా లేకపోయినా తన జాతి కోసం కడదాకా సేవ చేస్తానని స్పష్టం చేశారు. తన సామాజిక వర్గం కోసం ఎంతో మేలు చేశానని చెబుతూ ప్రధానంగా పేదలు, అర్హులకు వ్యవసాయ భూమి ఇప్పించడం జరిగిందని, ఎన్నో కేసులను 302గా మార్పించడం జరిగిందని, రాష్ట్రమంతా పర్యటిస్తూ దేవాలయాల్లో ప్రవేశాలకు నోచుకోని వారికి దర్శన భాగ్యం కల్పించానని చెప్పుకొచ్చారు. ఇలాంటి ముఖ్యమైన అంశాలను  ఎందుకు రాయలేదని నిలదీశారు. కానీ ఇలా తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్దతి కాదని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ హెచ్చరించారు. 

 ట్విట్టర్ లో ఒక నాయకుడు తనపై పోస్ట్ పెట్టాడని, ఆయనకు ధైర్యం ఉంటే తన ముందుకొచ్చి మాట్లాడాలని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ సవాల్ విసిరారు. అమరావతిలో వందల, వేల ఎకరాలు ఎస్సీల భూములు కాజేసిన వ్యక్తి తనపై అంత ఆసక్తి ఏంటని నిలదీశారు. ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా పార్టీలకతీతంగా అందరికీ న్యాయం అందేలా చర్యలు తీసుకుంటుమన్నారు. అందుకనే ఎస్సీ కమిషన్ కు జ్యూడీషియల్ పవర్స్ కావాలని కోరానన్నారు. మానిటరింగ్ విజిలెన్స్ కమిటీలో అంబేద్కర్ భావజాలం ఉన్న వాళ్లనే కమిటీ సభ్యులుగా తీసుకోవాలని చెప్పానన్నారు. ఇలాంటి అంశాలు రాయడం మానేసి దుష్ప్రచారం చేయడం తగదని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

Previous Post Next Post