హైదరాబాద్,10 అక్టోబర్(జనవిజన్ న్యూస్): రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అఖండ విజయం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు.
ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో మూడోసారి ముమ్మాటికీ అధికారంలోకి వచ్చేది భారత రాష్ట్ర సమితేనని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్‌కు 100 సీట్లు పక్కా
పదేండ్ల సమగ్ర ప్రగతే మా ఆయుధం
యుద్ధానికి ముందే 'హస్త' సన్యాసం
పోటీకి ముందే కాడి పడేసిన కమలం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అఖండ విజయం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో మూడోసారి ముమ్మాటికీ అధికారంలోకి వచ్చేది భారత రాష్ట్ర సమితేనని స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో తొలిసారి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలు ఏకపక్షమేనని, భారత రాష్ట్ర సమితికి భారీ విజయం ఖాయం అని తేల్చి చెప్పారు. రెండుసార్లు ప్రజలు నిండు మనసుతో ఆశీర్వాదం అందించారని, మూడోసారి కూడా ప్రజలు భారత రాష్ట్ర సమితికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
పదేండ్లలో బీఆర్‌ఎస్ సర్కారు ప్రజలకు అందించిన అభివృద్ధిని పాశుపతాస్త్రంగా మార్చుకొని ప్రతిపక్షాలపై అఖండ విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన విశ్వసనీయతే ఈ ఎన్నికల్లో తమకు విజయ మంత్రంగా మారుతుందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న ప్రజా వ్యతిరేక శక్తులకు, తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఎన్నికల్లో మరోసారి ఓటమి తప్పదని, ప్రజల మద్దతుతో గులాబీ జెండాను మరోసారి ఎగరేస్తామని చెప్పారు. నిరంతరం ప్రజలకు మంచిచేసిన బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు ఓటు వేస్తారని, ప్రజలను ముంచిన కాంగ్రెస్, బీజేపీపై వేటు వేస్తారని పేర్కొన్నారు.
మా సీఎం అభ్యర్థి కేసీఆర్.. మరి మీ అభ్యర్థి?
బీఆర్‌ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని, మరి ప్రతిపక్షాల సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తమ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిందని, వాళ్లు ప్రజాక్షేత్రంలో ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణలో గాంధీ సిద్ధాంతం తప్ప గాడ్సే సిద్ధాంతాలు నడవవని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికలను ఎదురొనేందుకు భారత రాష్ట్ర సమితి శ్రేణులు సమరోత్సహంతో కదం తొకుతున్నాయని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఎగరవేయాలన్న బలమైన కోరిక కనిపిస్తున్నదని వెల్లడించారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం నిబద్ధతతో చేసిన పోరాటాన్ని ప్రజలు గుర్తించి 2014 ఎన్నికల్లో తొలిసారి గెలిపించారని, సబ్బండ వర్గాలకు అందించిన సంక్షేమం వల్ల 2018లో రెండోసారి దీవించారని, పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని గుర్తించి మూడోసారి పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికలకు బీఆర్‌ఎస్ సర్వసన్నద్ధంగా ఉన్నదని తెలిపారు. యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్రసన్యాసం చేసిందని, పోటీకి ముందే బీజేపీ కాడి ఎత్తేసిందని ఎద్దేవా చేశారు. 100 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి బీఆర్‌ఎస్ తన పాత రికార్డులను తిరగరాస్తుందని పేర్కొన్నారు.
Tags
తెలంగాణ