రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్లు బంద్!

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్లు బంద్!

ప్రివిలేజ్ ఫీజు భారంపై బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల నిరసన


హైదరాబాద్, అక్టోబర్ 4 (జనవిజన్ టీవీ):

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం (అక్టోబర్ 5) నుంచి బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడనున్నాయి. ప్రభుత్వం కొత్తగా విధించనున్న ప్రివిలేజ్ ఫీజును వ్యతిరేకిస్తూ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1,200కు పైగా బార్ల కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంది.

ఏటా రూ.30 లక్షల అదనపు భారం!

ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న ప్రివిలేజ్ ఫీజుతో ఒక్కో బార్ యజమానిపై ఏటా సుమారు రూ.30 లక్షల వరకు అదనపు భారం పడుతుందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లైసెన్స్ ఫీజుల రూపంలో భారీ మొత్తాలు చెల్లిస్తున్నామని, కొత్త ఫీజుల విధింపు తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.

ఎక్సైజ్ కమిషనరేట్ ముట్టడికి పిలుపు

కొత్త ఫీజులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించాలని బార్ యజమానుల సంఘం నిర్ణయించింది. ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఇప్పటికే తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేసినట్లు తెలిపింది.

డిమాండ్లు నెరవేరే వరకు బంద్?

ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే నిరవధికంగా బార్లను మూసివేస్తామని యజమానుల సంఘం హెచ్చరించింది. అవసరమైతే నిరాహార దీక్షలు చేపడతామని ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా బార్ల బంద్ నేపథ్యంలో మద్యం ప్రియులు, బార్ అండ్ రెస్టారెంట్ వ్యాపారాలపై ఆధారపడిన సిబ్బంది, అనుబంధ వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూ ఉండండి.. జనవిజన్ టీవీ

Post a Comment

Previous Post Next Post