ఆది శ్రీనివాస్ ను వరించనున్న మంత్రి పదవి
మంత్రి కొండ సురేఖ వ్యవహారంలో జోరందుకున్న ఊహాగానాలు
మంత్రి కొండా సురేఖ అంశంలో జరుగుతున్న పరిణామాలు తన మంత్రి పదవికి ఎసరుపెట్టేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, ప్రజా సంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆరోపణలు చేసిన నుంచి రాష్ట్రంలో పరిణామాలు వేడెక్కాయి. తన శాఖకు సంబంధించిన టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ కొండ సురేఖ విమర్శనాస్త్రాలు సందించడం తెలిసిందే. ఈ అంశంపై మంత్రి పొంగులేటి కూడా వివరణ ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నిన్నటి నుంచి జరుగుతున్న నాటకీయ పరిణామాల మధ్య మంత్రి కొండ సురేఖ ఓఎస్డీ ని ప్రభుత్వం విధులనుంచి తప్పించడం తెలిసిందే. ఈ నేపద్యంలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కొండ సురేఖకు ఫోన్ చేసి సమావేశం అవుతారని, తదనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో కొండా సురేఖ మంత్రి పదవి ఉడుతుందనే ఊహాగానాలకు బలం చేకూరింది. కొండ సురేఖ కూతురు సుస్మిత సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు తన సోదరుల విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ పరిణామాలన్నీ రాజకీయాలను వేడెక్కించాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండ సురేఖ స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరు ఉండి, ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్న ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కుతుందనే ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. ఈ అంశంపై వివిధ వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ నడుస్తోంది. బీసీలకు సామాజిక న్యాయం పేరుతో ముందుకు వెళుతున్న ప్రభుత్వం మరో బీసీ ఎమ్మెల్యే కు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని ఉన్నత వర్గాల్లో చర్చ నడుస్తోంది. పాలనపై మంచి పట్టు ఉన్న వ్యక్తిగా, ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంలో ఆది శ్రీనివాస్ కు మంచి పేరుంది. ఆది శ్రీనివాస్ ను మంత్రి పదవి వరిస్తే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం మరింత వేగవంతంగా జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పులన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉన్నాయి. తదుపరి జరిగే పరిణామాల కోసం వేచి చూడాల్సిందే.