ప్రతి పేద మహిళ స్వయం సహాయక సంఘాల్లో ఉండాలి
వారికి బ్యాంకు ఖాతా, లింకేజీ కల్పించాలి
మహిళల అక్షరాభ్యాసం పూర్తి చేయాలి
పేద గర్భిణీ, పిల్లలను దత్తత తీసుకోవాలి, పౌష్టికాహారం అందించాలి
సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంక్ లు ఏర్పాటు చేయించాలి
సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్
సెర్ప్ ఉద్యోగులతో సమీక్ష
హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
--------------------------------------
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ -23
--------------------------------------
జిల్లాలోని ప్రతి పేద మహిళ స్వయం సహాయక సంఘాలో సభ్యురాలుగా ఉండాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశించారు. జిల్లాలోని సెర్ప్ డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించగా, ముఖ్య అతిథిగా సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, ఇంచార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరయ్యారు.
ముందుగా పలువురికి పోషకాహారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సెర్ప్ సీఈవో మాట్లాడారు. సెర్ప్ ప్రతిజ్ఞ ప్రకారం *అందుకున్న విజయాన్ని అందరికీ పంచుదాము* అనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కింద పేద మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థానాలకు తీసుకెళ్లలనేదే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలోని పేద మహిళలు మహిళా స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలని, వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి ఆర్థికంగా ఎదిగేలా మద్దతు ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఎస్ హెచ్ జీలకు భవనాలు ఉండాలని, సభ్యులందరూ అక్షరాభ్యాసం పూర్తి చేయాలని, వృద్ధ మహిళల, దివ్యాంగుల, కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, సోలార్ పవర్ యూనిట్, మండలానికి ఒక ఆర్టీసీ బస్సు ఇప్పించేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో పేద గర్భిణీలు, పోషకాహార లోపం ఉన్న పిల్లలను దత్తత తీసుకుని వారికి పోషకాహారం అందించాలని పిలుపు ఇచ్చారు. ఎస్ హెచ్ జీలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించేలా చూడాలని ఆదేశించారు. దీంతో మిగతా వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రుణాల రికవరీలో జిల్లా రాష్ట్రంలోనే ముందు స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. రానున్న ఉగాదిలోగా జిల్లాలోని మహిళలందరూ కనీసం చదువుకొని తమ బ్యాంకు ఇతర అన్ని కార్యకలాపాలు పూర్తి చేసుకునేలా తీర్చిదిద్దాలని పిలుపు ఇచ్చారు. ప్రతి పేద మహిళ స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలుగా చేరాలని, వారు ఆర్థికంగా ఎదగాలని, విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు.
అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడారు. జిల్లాలోని మహిళా సంఘాలకు 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేటాయించామని, పేద ఎస్ హెచ్ జీ సభ్యులు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు ఇప్పటిదాకా ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 10 కోట్లు ఇచ్చామని, వీఓ బిల్డింగ్స్ నిర్మాణానికి కృషి చేస్తామని, పెట్రోల్ బంక్, సోలార్ పవర్ యూనిట్ ఇతర పనులు పూర్తి చేస్తామని వివరించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ గడ్డం నగేష్, డిఆర్ డిఓ శేషాద్రి అడిషనల్ డిఆర్ డిఓ శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య తదితరులు పాల్గొన్నారు.