ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదు: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
లబ్ధిదారుల అవసరం మేరకు సమకూర్చాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
ట్రాక్టర్ యజమానులు అధిక ధరలు వసూలు చేయవద్దు
పెద్దూరులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పరిశీలన
-------------------------------
రాజన్నసిరిసిల్ల, 01 ఆగస్టు 2025:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ శుక్రవారం కేకే మహేందర్ రెడ్డి, అధికారుల తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత ఉందని, దీంతో పనులు వేగంగా ముందుకు వెళ్లడం లేదని పలువురు లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సరిపడా ఇసుక నిలువలు ఉన్నాయని వెల్లడించారు. నిర్మాణాదారులకు ఇసుక విషయంలో ఇబ్బందులు ఎదురైతే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ పరిధిలో వార్డ్ ఆఫీసర్ దృష్టికీ తీసుకెళ్లాలని సూచించారు. వారు తమ పరిధిలోని తహసిల్దార్ల దృష్టికి తీసుకెళ్లి ఇండ్ల నిర్మాణాలకు సరిపడా ఇసుక సమకూర్చుతారని స్పష్టం చేశారు.
పెద్దూర్ లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు సరిపడా ఇసుక సమకూర్చాలని సిరిసిల్ల తహసిల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, ఆయా దశల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. ట్రాక్టర్ యజమానులు అధిక ధరలు వసూలు చేయవద్దని సూచించారు. లేబర్, వాహన ఛార్జీలు కలిపి రూ.1500 ట్రీప్పునకు తీసుకోవాలని తెలిపారు. ఇష్టారాజ్యంగా ధరలు వసూలు చేస్తే అధికారుల దృష్టికి తీసుకరావాలని, ఇందిరమ్మ కమిటీ, ధరల నియంత్రణ కమిటీ నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు.