అల్మాస్ పూర్.. చారిత్రక నేపథ్యం.. పురాతన ఆనవాళ్లు

అల్మాస్ పూర్.. చారిత్రక నేపథ్యం..
మన చరిత్ర మన ముచ్చట్లు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నో చారిత్రక పరిణామాలకు, ఆనవాళ్లకు కేంద్రంగా ఉంటూ వస్తుంది. ఇటీవల ఆదిమానవుల చారిత్రక ఆనవాళ్లను పట్టి చూపిన ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి శివారు ప్రాంతంలోని బల్లేర్ తేట్టే గుట్ట, సిరిసిల్ల రెండవ బైపాస్ సమీపంలోని బుర్కమ్మగుట్ట, అదే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు శివారులోని బుర్కమ్మ గుట్ట గా పిలవబడే ప్రాంతాల్లో గత చారిత్రక స్మృతులను, అంతు చిక్కని మార్మికతను పట్టి చెబుతున్న అరుదైన రూపాలల్లో మట్టి పాత్రల ఆనవాళ్లు ఎన్నో చారిత్రక మైళ్ళు రాళ్ళను చూపుతున్నాయి.

ఇవేకాక ముస్తాబాద్ మండలం గన్నెవారిపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని గుట్టలలో ఆదిమానవులు గీసిన చిత్రాలు, ఆదిమానవుల ఆవాసా కేంద్రాలను పట్టి చూపిన ఎన్నో చారిత్రక ఆనవాళ్లు, కొత్త రాతియుగం మోదలుకొని అస్మిక, రాష్ట్ర కూటులు, చాళుక్యులు, శాతవాహనులకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. 
ఇలా కాలంతో పాటు పరిగెడుతూ పోతే సిరిసిల్ల రెండవ బైపాస్ సమీపంలోని శాతవాహన కాలానికి చెందిన ఇనుము శుద్ధి కర్మాకారాల ఆనవాళ్లు వెలుగు చూసాయి.  రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే పోతిరెడ్డిపల్లి శివారు అటవీ ప్రాంతంలో, వీర్నపల్లి మండల కేంద్రంలో కూడా ఇనుము శుద్ధి కర్మాగారాల ఆనవాళ్లు కనిపించాయి. 

నాగరికత మొదలైన తర్వాత కూడా చరిత్రకు సంబంధించిన అనేక అనవాళ్లు జిల్లాలో వెలుగు చూస్తునే ఉన్నాయి. శైవం, వైష్ణవానికి సంబంధించిన గురుతులెన్నో పలకరిస్తునే ఉన్నాయి. 

ఎల్లారెడ్డి పేట మండలంలో రెండు అరుదైన వైష్ణవ ఆలయాలు ఆసక్తి కలిగిస్తాయి. పురాణ, ఇతిహాసాలకు సంబంధించిన ఘట్టాలను రాతిపై శిల్పాలుగా మలచడం రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే చూడవచ్చు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులోని బావుని గుట్ట శైవానికి సంబంధించిన కొన్ని ఘట్టాలు చెక్కి ఉన్నాయి. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలోని రాముల గుట్టపై శ్రీరామ కళ్యాణానికి సంబంధించిన ఘట్టాలను శిల్పాలుగా మలిచారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులోని రాజుల ఒర్రెలో ఓ బండరాతిపై చెక్కిన శ్రీకృష్ణుడి  శిల్పం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇలా చరిత్రను తవ్వుతూ పోతే జిల్లాలో అనేక ఆనవాళ్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. 

ఇక అల్మాస్ పూర్ విషయానికి వద్దాం.. 

ప్రస్తుతం ఉన్న అల్మాస్ పూర్ తన చుట్టూ ఉన్న కొన్ని గ్రామాల నుంచి వచ్చి ప్రజలు ఇక్కడ అల్మాస్ పూర్ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఆనవాళ్లు కోల్పోయిన ఆ గ్రామాల తాలూకు సంబంధించిన కొన్ని గురుతుల గురించి  ఇక్కడి ప్రాంత ప్రజలు ఇప్పటికీ చెబుతుంటారు.

పూర్వం ఇక్కడ తూర్పు వైపు కొండ్రెడ్డిపల్లె(కొండారెడ్డిపల్లి) అనే గ్రామం ఉండేదని సుమారు 70, 80 కుటుంబాలు నివసించేవని చెబుతుంటారు. పడమర వైపు గట్టుపల్లి చెరువు, రాసిగుట్ట కింద "మఠం"అని ప్రత్యేక ప్రాంతం ఉండేదని చెబుతుంటారు. అప్పుడు ప్రత్యేకంగా అయ్య వార్లు పూజారులు ఉండేవారని ప్రచారం ఉంది. ఆ ప్రదేశాన్ని అయ్యోరుకుంట అని పిలిచేవారు. పడమర వైపు ఇప్పపూలకుంట ఉండేది. ఆ ప్రాంతాలన్నీ ఎలా కనుమరుగయ్యాయనే మిస్టరీ తేలాల్సి ఉంది. అక్కడ నివసించే ప్రజలే తూర్పు దిక్కున నూతనంగా ఏర్పాటు చేసుకున్న గ్రామము ప్రస్తుతం మనం చూస్తున్నాం అల్మాస్ పూర్ గ్రామం. ఆనాటి ఆనవాళ్లు ఇంకా ఆ ప్రాంతంలో కనిపిస్తుంటాయి. పడమర దిక్కున రంగనాయక స్వామి ఆలయం ఆ కాలానికి సంబంధించిందే. ఆనవాళ్లు కోల్పోయిన ప్రాంతంలోని "హనుమాన్ "విగ్రహం ఒకటి ఇప్పటికీ పూజలు అందుకుంటుందని గ్రామస్తులు ఇచ్చిన సమాచారం. 

    
జిల్లాలో అల్మాస్ పూర్ గ్రామానికి ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఇవి. కాలక్రమంలో కనుమరుగై పోయిన కొన్ని గ్రామాల తాలూకు ఆనవాళ్లు, పేర్లు ఇప్పటికీ మిస్టరీ గానే కనిపిస్తాయి. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులోని "బావుపేట, "నర్సంపల్లి"గ్రామాలు కనుమరు వైపు ఇప్పటికీ బావునుగుట్ట ఎదురుగా ఆ గ్రామాల తాలూకు ఆనవాళ్లు పరుచుకున్న పచ్చడి పొలాల్లో కొన్ని గురుతులు పలకరిస్తునే ఉంటాయి. వీర్నపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో కనుమరుగైపోయిన ఊరికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లో గ్రామాలు కనుమరుగై పోయాయో తెలియాల్సి ఉంది. అల్మాస్ పూర్ గ్రామం చుట్టూ అల్లుకున్న చరిత్రను పలకరించడం అంటే మన చరిత్రను మనం ఓసారి తడిమి చూసుకోవడమే. చరిత్ర పొడుగునా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక "చారిత్రక"ఆన వాళ్లు పలకరిస్తూనే ఉంటాయి.

    అల్లే రమేష్, జర్నలిస్ట్, సిరిసిల్ల

Post a Comment

Previous Post Next Post