రాజన్నసిరిసిల్ల, 19 మే 2025: తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు నేడు వ్యవసాయ సమాచారం రైతులకు చేరవేసే కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతులు పంటలకు సిఫార్సు చేసిన మోతాదులోనే యూరియాను వినియోగించాలని తెలిపారు. అధిక మోతాదులో యూరియా వాడకం వలన కలిగే నష్టాలను వివరిస్తూ, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీ కంపోస్ట్, పేడ ఎరువులను వినియోగించాలని సూచించారు. భూసార పరీక్షల ఫలితాలను బట్టి పంటలకు ఎరువులను వాడడం వలన సాగు ఖర్చు తగ్గించడమే కాకుండా, చీడ పీడల ఉధృతిని బట్టి సరియైన మోతాదులో రసాయనిక మందులను వాడడం పై అవగాహన కల్పించారు.
అలాగే నాణ్యమైన విత్తన ఎంపిక విధానం, పంటల్లో సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించడం, పంట వైఫల్యాల సమయంలో పంట భీమా పొందే విది, విధానాలను రసాయనిక మందుల కొనుగోలు రసీదులను భద్రపరచడం యొక్క ఆవశ్యకతను విపులంగా వివరించారు. సుస్థిరమైన వ్యవసాయంలో పంట మార్పిడి యొక్క ప్రాముఖ్యతను, సాగునీటి యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటడం, కశేరుక కీటకాల నిర్వహణపై సమాచారాన్ని వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు అధికారులతో పంటకు సంబంధించిన విషయాలపై చర్చించి రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం శాస్త్రవేత్తలు, రైతులు, అధికారులు ఈ కార్యక్రమంలో తెలుసుకున్న అంశాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల వ్యవసాయ శాస్త్రవేత్తలు, డా.రజియా సుల్తానా, కె. భవ్యశ్రీ, జిల్లా వ్యవసాయ అధికారి (డి. ఏ. ఓ.) శ్రీమతి అఫ్జల్ బేగం, మండల వ్యవసాయ అధికారి కె. సంజీవ్, వ్యవసాయ విస్తరణ అధికారులు ఎ.కరుణాకర్, ఎన్. మౌనిక అలాగే విత్తన అధికారి జి.మౌనిక , విద్యార్థులు, జి.మణికంఠ బి. శాలిని, రైతులు, స్వయం సహాయక సంఘంలోని మహిళా రైతులు పాల్గొన్నారు.