సీనియర్ కాంగ్రెస్ నాయకులకు పార్టీలో పదవీ బాధ్యతలు
అజ్మతుల్లా హుస్సేని, సంగీతం శ్రీనివాస్ లను అబ్జర్వర్లుగా పెద్దపల్లి జిల్లాకు
నాగుల సత్యనారాయణ గౌడ్ ను కామారెడ్డి జిల్లాకు నియమించిన హై కమాండ్
హైదరాబాద్ 23 ఏప్రిల్ (జనవిజన్ న్యూస్): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం ఆ పార్టీ హై కమాండ్ నడుం బిగించింది. జిల్లాల వారీగా అబ్జర్వర్లను నియమించి పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలని ప్రణాలికలు రూపొందించింది. ఈ నేపథ్యంలో జిల్లాకు ఇద్దరు చొప్పున సీనియర్ నాయకులను నియమిస్తూ గాంధీభవన్ వర్గాలు జాబితా విడుదల చేశాయి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే గ్రామస్థాయి కార్యకర్త నుంచి సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతం చేసే దిశగా ఈ అబ్జర్వర్లు పనిచేయనున్నారు. ఈ నిర్ణయంతో పలు జిల్లాల్లో అలక భూనిన కాంగ్రెస్ కార్యకర్తలకు సైతం ప్రాధాన్యం ఉండబోతోందని సమాచారం. ఇటీవల పార్టీలో చేరినవారికి సీనియర్లకు మధ్య సమన్వయ లోపంతో ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో వెళ్లడం లేదనే ఆరోపణలకు ఈ పరిణామంతో చెక్ పెట్టనున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో జిల్లాస్థాయితో పాటు మండల స్థాయిలో వివిధ నామినేటెడ్ పదవుల భర్తీ, సీనియర్ల పనితీరు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అబ్జర్వర్లు హై కమాండ్ కు నివేదించనున్నారు. తద్వారా పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు సమన్యాయం జరిగే విధంగా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ జాబితాలో రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన ఇరువురు సీనియర్ నాయకులకు పార్టీ హై కమాండ్ ప్రాధాన్యత కల్పించింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా కొనసాగుతున్న అజ్మతుల్లా హుస్సేనీ తో పాటు మరో సీనియర్ నాయకుడు సంగీతం శ్రీనివాస్ ను పెద్దపెల్లి జిల్లాకు, సిరిసిల్ల జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులుగా కొనసాగుతున్న నాగుల సత్యనారాయణ గౌడ్ ను కామారెడ్డి జిల్లాకు అబ్జర్వర్లు గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.