సిరిసిల్ల ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం
ప్రెస్ క్లబ్ పాలకవర్గం ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
సిరిసిల్ల, 28 మార్చ్: సమాజ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్రను ఎత్తిచూపుతూ, నాలుగు దశాబ్దాలుగా సిరిసిల్ల లోని అన్ని వర్గాలకు ప్రతిష్టాత్మకంగా సేవలందిస్తున్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయంత్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో గత పాలకవర్గం చేసిన అభివృద్ధి పనులు, పాత్రికేయుల సంక్షేమం కోసం వెచ్చించిన నిధులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఎన్నికల అధికారులుగా సీనియర్ పాత్రికేయులు కరుణాల భద్రాచలం, తడక విశ్వనాథం, టివి నారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో గత పాలకవర్గం పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ్యుల అభిప్రాయాలు, ఎన్నికల అధికారుల ఏకాభిప్రాయంతో నిర్ణయాలు ప్రకటించారు. నూతన సభ్యత్వాల నమోదు, ఎన్నికల నిర్వహణ, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల అభ్యర్థిత్వ రుసుము తదితర అంశాలను చర్చించారు. ఎన్నికలు నిర్వహించే తేదీని సభ్యుల అభిప్రాయం మేరకు ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.