'ఆది' కి మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ జిల్లా ముకాసం ఏకగ్రీవ తీర్మానం
సిరిసిల్ల, 05 మార్చ్: రాష్ట్ర మంత్రివర్గంలో మున్నూరు కాపులకు స్థానం కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు. బుధవారం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య హాజరయ్యారు. మున్నూరు కాపు సంఘం బలోపేతానికి గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలంటూ తీర్మానించారు. మున్నూరు కాపు సంఘానికి కేటాయించిన స్థలంలో ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేయాలంటూ తీర్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనాభా పరంగా అధిక శాతం ఉన్న మున్నూరు కాపులు అన్ని వర్గాలతో సఖ్యతతో ఉంటూ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘాల ప్రతినిధిగా వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం గర్వకారణమని అన్నారు. మున్నూరు కాపులకు ప్రాధాన్యత నిచ్చే క్రమంలో ఆది శ్రీనివాస్ కు ప్రభుత్వ విప్ గా ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వడం సంతోషకరమని చెప్పారు. మంత్రివర్గంలోనూ ఆయనకు స్థానం కల్పించాలని ఈ సందర్భంగా జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు అగ్గి రాములు, సంఘం ప్రతినిధులు చెలుకల తిరుపతి, కూరగాయల కొమురయ్య, చిలుక రమేష్, గడ్డం నరసయ్య, కచ్చకాయల ఎల్లయ్య, జిల్ల మహిళా అధ్యక్షురాలు కల్లూరు చెందన, మారం కుమార్, కల్లూరి రాజు, పలు మండలాల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Tags
AadiSrinivas